ఇంటర్ విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించండి
1 min readజిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యాబోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విద్యార్థుల పాస్ పర్సంటేజ్ పై జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ దాదాపు 140 జూనియర్ కళాశాలలో చదివే 5,861 మంది విద్యార్థులు ఈ ఏడాది త్రైమాసిక పరీక్షల్లో కేవలం 2,252 మంది విద్యార్థులకే పాస్ పర్సెంటేజ్ రావడం బాధాకరమని విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యాబోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. పిల్లలకు కనీసం పాస్ మార్కులు కూడా తెప్పించలేని స్థితిలో అధ్యాపకులు ఉన్నారని కలెక్టర్ ప్రశ్నించారు. 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్లో రన్నర్స్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. పిల్లలను భవిష్యత్తులో ఎలా తీర్చిదిద్దాలన్న సానుకూల దృక్పథంతో లెక్చరర్లు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రత్యేక ఓరియంటేషన్ ఇచ్చి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదవ తరగతిలో 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో 50 శాతం మార్కులకే పరిమితమవుతున్నారని… అందుకు గల కారణాలను విశ్లేషించి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. విద్యార్థులు కళాశాలలకు వచ్చేరీతిలో ఆసక్తి కల్పించేలా బోధన జరగాలన్నారు. విద్యార్థులు తక్కువ శాతంలో పాస్ మార్కులు వస్తే రాష్ట్రంలో జిల్లా ప్రగతి కుంటుపడుతోందని… ఇందుకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు ఉత్తమ విద్యా బోధన అందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ప్రిన్సిపాల్ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డివిఈఓ సునీత, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.