యుద్ధంలో మరణించిన అమరవీరులు, మాజీ సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం
1 min readఫ్లాగ్ డే ఫండ్ కోసం విరాళం అందజేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: యుద్ధంలో మరణించిన అమరవీరులు, మాజీ సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపునిచ్చారు.శనివారం సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఫ్లాగ్ డే ఫండ్ కోసం విరాళం అందజేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాల అమరవీరుల గౌరవార్థం ప్రతి ఏటా డిసెంబరు 7న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తారన్నారు.కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే అని కలెక్టర్ పేర్కొన్నారు..శత్రుసైన్యం భారత భూ భాగంలో అడుగు పెట్టకుండా తమ ప్రాణాలు పణంగా పెడతారని, దేశం కోసం ఇంత చేసిన వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు.త్రిసాయుధ దళాల సేవలు కీలకమని, దేశ సేవలో వీర జవానుల సేవలు మరువలేనివన్నారు.యుద్ధంలో మరణించిన సైనికులు, మాజీ సైనికుల సంక్షేమార్ధము ఏర్పాటు చేసిన ఫ్లాగ్ డే నిధికి విరాళాలు అందిస్తున్న ప్రజలందరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్. ఆర్. రత్న రూత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.