విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటం సమిష్టి బాధ్యత – సోమిశెట్టి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా విద్యాశాఖ మంత్రిగా శ్రీ నారా లోకేశ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (పిల్లల బంగారు భవిష్యత్ కోసం.. బడి వైపు ఒక అడుగు) కార్యక్రమం ఈ రోజు కర్నూలు నగరంలోని శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక నగర పాలక ఉన్నత పాఠశాల, ప్రకాష్ నగర్ నందు నిర్వహించడం జరిగింది. కార్యక్రమమునకు కుడా చైర్మన్ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యులుగా హాజరుకావడమైంది. ఈ సంధర్బంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలల మధ్య సంబంధాలు బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చేయవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనను గమనించాలని, వారు మంచి మార్గంలో వెళ్తున్నారో, చెడు మార్గంలో వెళ్తున్నారో గమనించాలని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూడాలని తెలిపారు. ప్రతి విద్యార్దికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, విద్యావ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేయాలన్నారు. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తామన్నారు.