PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ బేతంచెర్ల/నంద్యాల: విజ్ఞానంతో కూడిన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జ్ఞానంతో కూడిన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరారు. అకడమిక్ విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికి తీసి ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులు, గురువులదేనని ఆమె తెలిపారు. వార్షిక పాఠ్యాంశాలలో ఉత్తీర్ణతతో పాటు పోటీ పరీక్షలకు కూడా సిద్ధమయ్యే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేయాలన్నారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో ఎలా ఉంటున్నారు, పాఠ్యాంశాలు అర్థం కాకపోతే ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు మరింత పరిణితి చెందేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన అంశాలను విద్యార్థులకు బోధించాలన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభ్యాసన సామర్ధ్యాలు, క్రీడలు, విద్యార్థులకు ఆసక్తి వున్న అంశాలను  గుర్తించి భవిష్యత్తులో ఏ విధంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంయుక్తమవుతోనే పిల్లల భవిష్యత్తు చక్కగా దిద్ధబడుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కలెక్టర్ అన్నారు.పాఠశాలలో ఉన్న తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు, విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఏ విధంగా ఉన్నారనే అంశాలపై ప్రభుత్వం ర్యాంకింగ్ ఇవ్వనుందని కలెక్టర్ తెలిపారు. 20 మంది క్వాలిఫై టీచర్లు ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 398 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని… ఈ పాఠశాలలో చదివే పిల్లలకి మంచి ఫౌండేషన్ ఉంటుందని తల్లిదండ్రులకు తెలిపారు.  విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీల వ్యసనానికి గురవుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్న తరుణంలో పిల్లల భవిష్యత్తు గుర్తించి పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తల్లితండ్రులు, ఉపాధ్యాయులపై వుందన్నారు. సమాజంలో గౌరవింపబడాలంటే 5 వ కారాలతో కూడిన ప్రవర్తన ఉండాలని సూచించారు. వస్త్రేనా వపుషా వాచా విద్య యా వినయైన చ వ కారైహి పంచ బి ర్యుక్తః న రో భవతి పండితః అనగా ఒక వ్యక్తి సమాజంలో గౌరవించబడాలంటే వస్త్రధారణ ఇతరులకు ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు, పాజిటివ్ ఆలోచనలతో కూడిన ఆలోచన, అర్థవంతంగా నేర్చుకున్న విద్య, వినయ విధేయతలతో కూడిన సత్ప్రవర్తన కలిగి ఉండి, మంచి ఆహారం తీసుకొనుట ద్వారా చక్కటి ఆరోగ్యం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని కలెక్టర్ శ్లోక రూపంలో వివరించారు. అన్ని పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యం పై స్క్రీనింగ్ టెస్ట్ కూడా నిర్వహించి అవసరమైన మందుల సరఫరా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.అనంతరం తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి కలెక్టర్ సహపంక్తి శుభదిన్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ మల్లికార్జున, గ్రామ సర్పంచ్ రాజు, మండల కన్వీనర్ పాఠశాల పూర్వ విద్యార్థి ఎల్లా నాగయ్య, ఎంపీటీసీ వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *