చేనేత హస్త కళలను కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి
1 min readమాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: చేనేత కళాకారులను, హస్తకళలను, కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ నందు కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత, హస్తకళల వస్తు ప్రదర్శనశాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఈరోజు ప్రారంభించారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాకారుల కళకు వెలకట్టలేమని, వారు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి ప్రతి ఒక్కరు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెద్ద పెద్ద షోరూంలలో వీటి విలువ ఎంతో ఎక్కువగా ఉంటుందని, అటువంటిది తయారీదారులే స్వయంగా ప్రదర్శనశాలలో అమ్ముకోవడం వల్ల ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఎంతో తక్కువ ధరకు మనకు వస్త్రాలు, వస్తువులు లభిస్తున్నాయని అన్నారు. ఇటువంటి ప్రదర్శనశాలల వల్ల మన ప్రాంతంలో తయారయ్య వస్తువులే కాకుండా దేశ నలుమూలల నుండి నైపుణ్యం పొందినటువంటి కళాకారుల చేతులలో తయారైనటువంటి వస్తువులు మనకు అందుబాటులోకి వస్తున్నాయని టీజీ వెంకటేష్ అన్నారు. ధరలో కానీ మన్నికలో కానీ ఈ వస్తువులు ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉన్నాయని, ఈనెల 19 వరకు ఉండే ఈ వస్తువు ప్రదర్శనశాలను కర్నూల్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్, సత్యనారాయణ, కిషోర్, కృష్ణ, శ్రీరామ్, హుస్సేన్, మాజీ డిఎస్పి మహబూబ్ బాషా, నాగేశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు.