గీత అమృత వర్షిణి.. భగవద్గీత ఉపనిషత్తుల సారాంశం
1 min readసద్గురు భానుమతమ్మ – ప్రముఖ ధార్మికవేత్త
ఘనంగా ముగిసిన గీతా జయంతి వేడుకలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవద్గీత ఉపనిషత్తుల సారాంశమని, బ్రహ్మ విద్య అని, అటువంటి బ్రహ్మవిద్య అయిన భగవద్గీతపై శ్రాద్ధ కలగాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే సాద్యమవుతుందని, ప్రముఖ ధార్మికవేత్త, విశ్రాంత అద్యాపకురాలు సద్గురు భానుమతమ్మ అన్నారు. విద్యాప్రకాశానందగిరి స్వామి గీతా ప్రచార ధామం, కర్నూలు వారి ఆధ్వర్యంలో భగవద్గీత సహస్ర గళార్చన పేరుతో నిర్వహించిన గీతా జయంతి వేడుకల సందర్భంగా వారు ముగింపు సభా కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. భగవద్గీతపై భక్తులకు ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వేల మంది పాల్గొన్నారు. గీతా ప్రచార సంఘం అధ్యక్షులు గీతారత్న డి.వి.రమణ గీతా ప్రచారానికి చేస్తున్న కృషిని పలువురు ప్రశంసించారు. భగవద్గీతలో ప్రతిభ కనబరిచి, మైసూరు దత్తపీఠం నుండి బంగారు పథకం సాధించిన రాయచోటి నాగ జ్యోతిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు నగర కమీషనర్ రవీంద్ర బాబు, చిన్మయ మిషన్ మాతా సుప్రేమానంద, గీతా ప్రచార సంఘం సభ్యులు ఇల్లూరు రమణ, సింహాద్రి రమేశ్, జగన్, అనంత అనిల్, మహాబలేశ్వర్, నాగోజీ, సత్యసాయి సేవాసమితి బృందంతో పాటు, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.