సంక్రాంతి నాటికి జిల్లా రోడ్లకు మహర్దశ
1 min readగుంతలు లేని రోడ్ల కార్యక్రమంలో 174 రోడ్ల పనులు మంజూరు
రూ.97.90 కోట్లతో పనులు చేపడుతున్న ఆర్ అండ్ బి శాఖ
682 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మత్తులు
తొలివిడతలో 51 పనులకు రూ.22.24 కోట్ల నిధులు
రెండో విడతలో 123 పనులకు రూ.22.24 కోట్లతో మంజూరు
ఇప్పటికే తొలివిడత 51 పనులకు టెండర్లు ఖరారు
రెండో విడత పనులకు టెండర్లు ఖరారు
జిల్లా కలెక్టర్ వారి నిరంతర పర్యవేక్షణతో పనులు వేగవంతం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జిల్లాలో రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్లకు మహర్దశ పట్టింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని చక్కదిద్ది, మెరుగైన రవాణా, ప్రయాణ వసతులు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గుంతలు లేని రోడ్ల కార్యక్రమంతో జిల్లాలో రోడ్లు పెద్ద ఎత్తున మరమ్మత్తులకు నోచుకోనున్నాయి. దీంతో రోడ్లపై ప్రయాణించే ప్రజలు, వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. జిల్లాలో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా 174 పనుల కింద రూ.97.90 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని 682 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఏర్పడిన గుంతలను పూడ్చివేసే దిశగా రోడ్లు భవనాల శాఖ పనులు చేపట్టి సంక్రాంతి నాటికి ఆ రోడ్లలో మరమ్మత్తులు పూర్తిచేయాల్సి వుంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువులోగా పనులు పూర్తిచేసేందుకు ఎస్.ఇ. నుంచి మొదలుకొని ఏ.ఇ. వరకు ఆ శాఖ అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుంతలు లేని రోడ్ల కార్యక్రమం కింద తొలివిడతలో జి.ఓ.ఆర్.టి. నెం.53 కింద 51 పనులను రూ.22.24 కోట్లతో మంజూరు చేసింది. ఈ పనుల ద్వారా 158.27 కిలోమీటర్ల రోడ్లను మరమ్మత్తులు చేసి పునరుద్దరించేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. తొలివిడత పనుల్లో ఇప్పటికే 51 పనులకు టెండర్లు ఖరారు చేసిన ఆ శాఖ అధికారులు, 43 పనులను ప్రారంభించి దాదాపు 96 కిలోమీటర్ల నిడివి గల రోడ్లలో మరమ్మత్తులు ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన పనులు ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. రెండో విడతలో 348, 349 నెంబరు జి.ఓ.ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీన 123 పనులను రూ.75.66 కోట్లతో మంజూరు చేసింది. ఈ పనులతో 523.774 కిలోమీటర్ల మార్గంలో రోడ్లకు మరమ్మత్తులు చేపట్టియున్నారు. పిచ్చి మొక్కల నిర్మూలన కొరకు రూ.0.97 కోట్లతో మంజూరు చేశారు. ఈ పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు కాబడినవి.
శాశ్వత ప్రాతిపదికన కొన్ని పనులను కూడా తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువును నిర్దేశించిందని ఆ శాఖ ఎస్ ఈ జాన్ మోషే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి గుంతలు లేని రహదారుల కార్యక్రమంలో పనులు వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రోడ్లు భవనాల శాఖ అధికారులతో నిరంతరం మాట్లాడుతూ పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. టెండర్ల ఖరారు, పనులు ప్రారంభించడం, వాటిని పూర్తిచేయడం తదితర దశల్లో ప్రగతిపై అధికారులకు సూచనలు చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. రోడ్ల మరమ్మత్తులు, వాటి పునరుద్దరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో సంక్రాంతి నాటికి జిల్లా రోడ్లన్నీ కొత్తరూపును సంతరించుకొని ఇతర ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు వచ్చే జిల్లా వాసులకు తీపిగుర్తులు మిగల్చనున్నాయి.