మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయండి
1 min readరైస్ మిల్లర్లు, ట్రేడర్లను సూచించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రైతు నష్టపోకుండా మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ రైస్ మిల్లర్లు, ట్రేడర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వరి ధాన్యం మద్దతు ధరతో కొనుగోలు అంశంపై రైస్ మిల్లర్లు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో జిల్లాలో వరి పంట దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. జిల్లాలో ఎన్డీఎల్ ఆర్7 మరియు బిపిటి 5204 వెరైటీ రకాల వరి ధాన్యం దిగుబడులు జిల్లాలో అధికంగా వచ్చాయన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మంచి ధర ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత సీజన్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట దిగుబడి అధికంగా రావడం వలన కొంతమేర ధరలు తగ్గాయన్నారు. కొన్నిచోట్ల వరి ధాన్యంలో తేమశాతం సాకుగా చూపి మిల్లర్లు, ట్రేడర్లు మద్దతు ధర కంటే తక్కువ ధరకు దాన్యం కొనుగోలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. తేమశాతం తక్కువగా చూపి రైతుల నుండి ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లయితే అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. రైతులు తమ ధాన్యంలో తేమ శాతాన్ని సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏ ఒక్క రైతు మద్దతు ధర కంటే తమ ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దని జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ వెంకట్రాముడు, డిఏం సివిల్ సప్లై రాజు నాయక్, అన్ని రైస్ మిల్లర్ల ట్రేడర్లు పాల్గొన్నారు.