ఈనెల 16న ముఖ్యమంత్రి పోలవరం పర్యటన
1 min readసిఎం పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు
ఎస్పీ కెపిస్ కిషోర్ తో కలిసి పోలవరంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఈనెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పోలవరంలో శనివారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్, జాయింట్ కలెక్టర్పి.ధాత్రి రెడ్డి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.అనంతరం ప్రాజెక్ట్ సమావేశపు హాలులో అధికారులతో పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ ఉదయం సుమారు 10. 45 ని.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి చేరుకుంటారని, అనంతరం డయాఫ్రమ్ వాల్, తదితర ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలిస్తారన్నారు. అనంతరం అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్షించి, పనుల వేగవంతం చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమయ్యేలా ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ముందుగా హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం డయాఫ్రమ్ వాల్, తదితర నిర్మాణ ప్రాంతాలలో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు సంబందించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. పనుల ప్రగతిపై ప్రాజెక్ట్ ఇంజినీర్లు కలెక్టర్ కు వివరించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి పాల్గొనే అన్ని ప్రదేశలలో పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్త్ ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం.వి. రమణ, పోలవరం డిఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, ఏ .ఆర్. డిఎస్పీ చంద్రశేఖర్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.