ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా పరిరక్షించాలి
1 min readఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పల్లె పండుగ లో భాగంగా నిర్మిస్తున్న రోడ్లు సంక్రాంతి లోపు పూర్తి కావాలి
ఎంఎస్ఎంఈ సర్వే వేగవంతం కావాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గ్రామ పంచాయతీలు,మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయితీల లోని ఆస్తుల పరిరక్షణ, జిల్లా స్థాయి సమావేశం, ఉపాధి హామీ పథకం అమలు, పల్లె పండుగ – రోడ్ల నిర్మాణం, ఎంఎస్ఎంఈ సర్వే పురోగతి పై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, స్థానిక సంస్థల అధికారులు, తహశీల్దార్ లు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు అన్నింటినీ ఆక్రమణలకు గురికాకుండా చూడాలన్నారు. 2011లో ఇచ్చిన జిఓ ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఆస్తులకు సంబంధించి ఇన్వెన్టరీ రిజిష్టర్లు (ఎ,బి,సి) కచ్చితంగా నిర్వహించాల్సి ఉందన్నారు.. ఆ మేరకు రిజిష్టర్లు నిర్వహిస్తున్నారా లేదా అని డిఎల్ పివో లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిష్టర్లు నిర్వహిస్తున్నామని, అప్డేట్ చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్ కు వివరించారు..రెండు వారాల్లోపు రిజిష్టర్ లను పూర్తి వివరాలతో అప్డేట్ చేయాలని కలెక్టర్ డిఎల్ పీవోలను ఆదేశించారు. ఈ అంశాన్ని డిపిఓ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ ఆస్తులపై పంచాయతీ సెక్రటరీకి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు భూముల స్థితిగతులపై వెబ్ ల్యాండ్ లో పరిశీలించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆక్రమణలకు గురి కాకుండా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురి అయినప్పుడు పంచాయతీ సెక్రటరీ వెంటనే నోటీసు ఇవ్వాలని, సంబంధిత తహశీల్దార్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసు సహకారం తీసుకొని ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో స్మశాన భూములు, ఇరిగేషన్ కెనాల్స్ కూడా ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం డిఎల్పిలు, ఈఓఆర్డిలతో మాట్లాడి గ్రామ పంచాయతీల వారీగా పంచాయతీ ఆస్తుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఉపాధి హామీ పథకం అమలులో పురోగతి చాలా తక్కువగా ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలాల్లో ఎంత మంది లేబర్ వస్తున్నారు ? రానున్న 3 నెలల్లో లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు? ఎంపిడిఓలు రోజూ ఈ అంశంపై సమీక్ష చేస్తున్నారా అని కలెక్టర్ లక్ష్య సాధనకు వీలుగా మూడు రెట్లు పనులు శాంక్షన్ చేసుకోవాలన్నారు. ఎంపిడిఓలు సాఫ్ట్వేర్ లో వర్క్ ఐడి జనరేషన్, మస్టర్స్ అప్డేషన్ పై అవగాహన పెంచుకోవాలని, అందువల్ల ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ కు సంబంధించి మండలంలోని గ్రామాల్లో జరిగిన ప్లాంటేషన్ పనులను ఎంపిడిఓలు, ఎపిఓ, ఎపిడి సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ జనరేట్ చెయ్యాలని కలెక్టర్ స్పష్టం చేశారు.పంచాయతీ పనులకు సంబంధించి 830 పనులు మంజూరు కాగా అందులో 581 పనులు మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. ఇందులో మంత్రాలయం, ఆలూరు, పెద్దకడుబూరు, కొసిగి, కౌతాళం, చిప్పగిరి, కోడుమూరు, ఆస్పరి మండలాల్లో పనుల్లో పురోగతి లేదని, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎంపిడిఓలు, పంచాయతీ రాజ్ ఎఈలను ఆదేశించారు.. ఎంపిడిఓలు ఎప్పటికపుడు పనులు జరుగుతున్న గ్రామాల్లో పర్యటించి రోడ్ల నిర్మాణపు పనులు సంక్రాంతి లోపు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేది నాటికి ఎంఎస్ఎంఈ సర్వేను కచ్చితంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సర్వేకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే జిల్లా పరిషత్ సీఈఓ, పరిశ్రమల శాఖ జిఎం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అదనపు ఎస్పీ (అడ్మిన్) జి.హుస్సేన్ పీరా, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ రామ చంద్రారెడ్డి, గనుల శాఖ అధికారి రావిచంద్, డిపిఓ భాస్కర్, జలవనరుల శాఖ ఎస్ ఈ బాలచంద్రారెడ్డి, అన్ని మండలాల ఎంపిడిఓలు, ఈఓఆర్డిలు తదితరులు పాల్గొన్నారు.