అంతర్ విశ్వవిద్యాలయ పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 21 నుండి 28 వరకు యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, కేరళలో జరుగనున్న అంతర్ విశ్వవిద్యాలయ పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీలకు క్లస్టర్ యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టును పంపిస్తున్నట్లుగా క్లస్టర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్. సాయి గోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా గత 15 రోజులుగా ప్రభుత్వ పురుషుల కళాశాలలో నిర్వహించిన శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో క్లస్టర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్. సాయి గోపాల్ , రిజిస్ట్రార్ డాక్టర్. కట్టా వెంకటేశ్వర్లు మరియు విశ్వవిద్యాలయ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డు శ్రీ వై. శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధించగలరని తెలిపారు. విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో క్రీడలపై శ్రద్ధ పెడితే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని గుర్తు చేశారు.క్లస్టర్ విశ్వవిద్యాలయ ఫుట్ బాల్ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసి క్రీడాకారులు అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి క్లస్టర్ విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫుట్బాల్ జట్టుకు శిక్షణ ఇచ్చిన సంతోష్ ట్రోపి ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారుడు శ్రీ సి. విజయ్ కుమార్, జట్టు మేనేజర్ గా వ్యవహరిస్తున్న కె. ఫణి నిఖిల్ హర్ష మరియు జట్టుని అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు పంపుటకు కృషిచేసిన వై. శ్రీనివాస్ రెడ్డి లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. బాల సుబ్రమణ్యం సిల్వర్ జూబ్లీ కళాశాల ట్రైనీ PD డా.వై ఫఫక్కీరయ్య సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు బి. రమేష్ పాల్గొన్నారు.