రవీంద్ర … శ్రీకృష్ణ జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక అబ్బాస్ నగర్ లోని శ్రీకృష్ణ మరియు రవీంద్ర జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు పుల్లయ్య ,విశిష్ట అతిథిగా రవీంద్ర విద్యాసంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ జి.మమత మోహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జి. పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ ముఖ్యంగా జూనియర్ కాలేజీ దశ చాలా బాధ్యతతో కూడుకున్నదని ఈ దశలో ఏ విద్యార్థి కూడా నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎందుకంటే మీ పై చదువులకు పునాది ఇంటర్ దశ కావున తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తెరిగి ప్రతి విద్యార్థి బాధ్యతతో చదవాలన్నారు. బాలికా విద్య కోసం అబ్బాస్ నగర్ లో ప్రత్యేకంగా రవీంద్ర బాలికల పాఠశాల ,జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలతో పాటు రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల పేరుతో ప్రత్యేకంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాలను వెంకాయపల్లి నందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏస్త్రీ అయితే కుటుంబంలో గొప్పగా చదువుకుంటుందో ఆ కుటుంబము తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు . నేడు స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తూ సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు. అనంతరం డాక్టర్ మమతా మోహన్ మాట్లాడుతూ నేడు స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారన్నారు .ప్రభుత్వాలు మహిళలకు కేటాయించిన 33% రిజర్వేషన్ ను సద్వినియోగపరచుకొని పేదవారికి ఉపయోగపడే ఉన్నతస్థాయి ఉద్యోగాలు మీ సొంతం చేసుకోవాలన్నారు. అనంతరం వివిధ అంశాలలో విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్యఅతిథులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల సమన్వయకర్త డి. సురేంద్రనాథ్ రెడ్డి. ప్రిన్సిపాల్ వై. ప్రసాదరెడ్డి, అధ్యాపక బృందము పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.