ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం … అనుసరణీయం
1 min readసీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ …. డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని అనుసరణీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగరంలోని శ్రీనివాస నగర్ లో ఉన్న స్టాంటన్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ దేవ సహాయం, మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ దేవదూతగా యేసు ప్రభువు భూమి మీదకు వచ్చినప్పటికీ సాధారణ మానవుడిగా జీవించారని చెప్పారు. ఏసుప్రభువు ప్రజల పాపాలను తొలగించేందుకు ఈ భూమి మీదకు వచ్చారని వివరించారు ఏసుప్రభువు అందరూ ప్రేమ, ఆనందం, సహాయం, సేవా గుణాలతో జీవించాలని సూచించారని, ఇది అందరూ పాటించాలని చెప్పారు. సమాజంలో క్రైస్తవులు అతి సున్నిత మనస్కులని వారి జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పారు. ముఖ్యంగా మదర్ తెరిసా లాంటివారు ఇతర దేశాల నుంచి వచ్చి పేదల కోసం చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయం అని వివరించారు. ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలని ఇతరుల మతాలను గౌరవిస్తూ జీవించాలని సూచించారు. అన్ని మతాలను సమానంగా ఆదరించడం మన దేశం ప్రత్యేకతను వివరించారు. దేశంలో క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ హాస్పిటల్ లు, క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని వెల్లడించారు. ఏసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవాలని బైబిల్ ద్వారా సూచించారని ఆయన వెల్లడించారు. పవిత్ర బైబిల్ గ్రంధాన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు.