ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదు..
1 min readడాక్టర్ జయప్రకాష్ ,లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఒత్తిడి, పోషకాహార లోపం, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఎక్కువగా వినియోగించడం ,అధిక కాలుష్యం తదితర కారణాల కారణంగా కంటి సమస్యలు అధికమయ్యాయి అని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయ ప్రకాష్ అన్నారు. బాల సాయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాల సాయి కంటి ఆసుపత్రి ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ,సందీప్ క్లినిక్ ల సంయుక్త ఆధ్వర్యంలో కల్లూరు ఆదిత్య పాఠశాల ఆవరణలో సీనియర్ సిటిజన్స్ కు, ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు బి.పి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యము కంటి వ్యాయామం చేయడం వల్ల కంటి రక్తనాళాలు యాక్టివ్ అయ్యి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. వీలైన సమయంలో కళ్ళకు విశ్రాంతిని ఇవ్వడం చేస్తూ ఉండాలన్నారు. విశ్వ భారతి రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ కంప్యూటర్, టీవీ ,ల్యాప్టాప్,సెల్ ఫోన్లు అధికంగా వాడడం వల్ల ఎక్కువగా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడి కళ్ళు మంటలు, కళ్ళు ఎర్రబడడం , కళ్ళు వెంట నీరు కారడము లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. డాక్టర్ రంగనాయకులు మాట్లాడుతూ విటమిన్లు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నాణ్యతలేని స్వీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ 40 సంవత్సరములు పైబడిన వారు తరచు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్ వాసు దేవయ్య మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.