పేద కళాకారులకు అండగా ఉంటా-టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అవసరమైన కళాకారుల కుటుంబాలకు అండగా ఉంటానని టీజీవి కళాక్షేత్రం కళాకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త టి జి వెంకటేష్ అన్నారు. సోమవారం సాయంత్రం ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన, రంగస్థల నటులు సామ్యూల్ కుటుంబానికి ఆయన 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా ఆయనకు అవసరమైన వైద్య సౌకర్యాలు సమకూరుస్తానని తెలిపారు. రాబోయే కాలంలో పేద, వృద్ధ కళాకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ సామ్యూల్ ఆంధ్ర దేశంలో నారద పాత్రకు పేరున్న నటులన్నారు. ఆయన ప్రమీల, అర్జున పరిణయం నాటకంలో నారద పాత్రకు అలాగే నర్సింహారెడ్డి నాటకంలో అనుచరుని పాత్రకు రెండు నంది అవార్డులు అందుకున్నారని తెలిపారు. నటన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించే శామ్యూల్ అనారోగ్యం పాలు కావడం దురదృష్టకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీజీవి కళాక్షేత్రం సహాయ కార్యదర్శి పి రాజారత్నం పాల్గొన్నారు.