బిఇ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ విజయ్ కుమార్ దాట్ల ఫౌండేషన్
1 min readసమాజంలో సభ్యుల నైపుణ్యాలను పెంచడమే లక్ష్యం
ఎవరైనా పేర్లు నమోదుచేసుకుని ఉద్యోగర్హతకు నైపుణ్యాలు పెంచుకోవచ్చు
ఏడాదికి 600-720 మంది వరకు శిక్షణ ఇచ్చే అవకాశం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), తెలంగాణ ప్రభుత్వం సహకారంతో బయోలాజికల్ ఈ లిమిటెడ్ సీఎస్ఆర్ విభాగమైన డాక్టర్ విజయ్ కుమార్ దాట్ల ఫౌండేషన్ బొల్లారంలో బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. వ్యక్తులను శక్తివంతం చేయడానికి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి రూపొందించిన ఉచిత, పరిశ్రమ సంబంధిత శిక్షణా కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ యువత నైపుణ్యాలను పెంపొందించాలన్నదే ఈ కేంద్రం లక్ష్యం. అధిక డిమాండ్ ఉన్న ఫార్మా, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ అండ్ వెల్నెస్, డిజిటల్ కమ్యూనికేషన్ (ఐటీ/ఐటీఈఎస్), రిటైలింగ్ లాంటి రంగాల్లో ఉచిత శిక్షణ, వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందించేందుకు ఈ కేంద్రం సిద్ధమైంది. స్థానిక యువత ఈ కార్యక్రమాల్లో చేరి ఉపాధి పొందవచ్చు. ఒక్కో శిక్షణ కార్యక్రమం మూడు నెలల పాటు ఉంటుంది. ప్రతి కోర్సుకు శిక్షణ పొందిన బోధకులు ఉంటారు. ఒకేషనల్ కోర్సులకు నిర్దిష్ట అర్హత అవసరం లేదు. పారిశ్రామిక కోర్సులకు కనీసం పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ చదివినవారు అర్హులు. నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందాలనుకునే మహిళల్లో ఎవరికైనా చిన్న పిల్లలు ఉంటే, వారి సంరక్షణ సేవలను కూడాఇక్కడ ఉచితంగా అందిస్తారు. దీనివల్ల వారు తమ పిల్లలను సురక్షితమైన వాతావరణంలో ఉంచి.. తమ శిక్షణ, నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టచ్చు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ దాట్ల ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ త్రిషన్య రాజు మాట్లాడుతూ “నైపుణ్యాభివృద్ధి ద్వారా ప్రజలకు సాధికారత కల్పించాలన్న మా నిబద్ధతకు ఈ కేంద్రమే నిదర్శనం. నిరుద్యోగ యువతకు శిక్షణ, నైపుణ్యాలు అందించడం, సుస్థిర జీవనోపాధి కల్పించడం, కమ్యూనిటీలను బలోపేతం చేయడం కోసం జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నైపుణ్యాభివృద్ధి ద్వారా సమాజాన్ని సాధికారం చేయడం ఒక పరివర్తనాత్మక ప్రయాణం. ఇది కేవలం ఒక మిషన్ కాదు. బయోలాజికల్ ఇ. లిమిటెడ్ వారి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో.. మేము సామర్థ్యాన్ని అవకాశంగా మారుస్తాము. స్థిరమైన వృద్ధిని ప్రోత్సహిస్తాము. అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రోత్సహిస్తాము” అన్నారు. డాక్టర్ విజయ్ కుమార్ దాట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న మోడల్ మార్కెట్ భవనాన్ని పునరుద్ధరించి తరగతి గదులు, క్యాంటీన్, కౌన్సెలింగ్ గది, ఫార్మాస్యూటికల్ ట్రైనింగ్ ల్యాబ్ లు, ఐటీ/ఐటీఈఎస్ శిక్షణ కోసం 16 సీట్ల కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో ప్రతి మూడు నెలలకు 180 మంది అభ్యర్థులకు అన్ని కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇలా సంవత్సరానికి 600-720 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.
దాట్ల ఫౌండేషన్ గురించి: దాట్ల ఫౌండేషన్ భారతదేశం అంతటా విద్య, ఆరోగ్యం, ఐటీ అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధి, కమ్యూనిటీ సంక్షేమాన్ని మెరుగుపరచడానికి అంకితమైంది. ప్రభావవంతమైన సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీలను మెరుగుపరచడం, ప్రలకు సాధికారత కల్పించడం ఫౌండేషన్ లక్ష్యం.