PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌ల్లిదండ్రులూ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి…

1 min read

పిల్లల‌కు వాస్తవ ప్రపంచాన్ని ప‌రిచ‌యం చేస్తున్న తీరు ప్రశంస‌నీయం

 శ్రీ‌త్రివేణి పాఠ‌శాల 11వ వార్షికోత్స‌వంలో అమోర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ కిశోర్ బి.రెడ్డి

ఉత్సాహ‌భ‌రితంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు

త‌ల్లిదండ్రుల‌కు పాఠ‌శాల ఛైర్మన్ గోవ‌ర్ధ‌న‌రెడ్డి కృత‌జ్ఞత‌లు

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్‌ : విద్యార్థుల‌కు వాస్తవ ప్రపంచాన్ని ప‌రిచ‌యం చేసే దిశ‌గా ప్రణాళికాబ‌ద్ధంగా ప్రోత్సహించ‌డంలో శ్రీ‌త్రివేణి పాఠ‌శాల కృషిచేస్తున్న తీరు ప్రశంస‌నీయ‌మ‌ని అమోర్ హాస్పిట‌ల్స్, అమోర్ క్యాన్సర్ సెంట‌ర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్ బి.రెడ్డి అన్నారు. చిన్నారుల‌తో పాటు.. వారి త‌ల్లిదండ్రులు కూడా ఆరోగ్యంపై దృష్టి పెట్టాల‌ని ఆయ‌న సూచించారు. వాతావ‌ర‌ణం మారుతోంద‌ని, త‌రచు ఏవో ఒక కొత్త వైర‌స్‌లు వ‌స్తూ ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయ‌ని, అందువ‌ల్ల ప్రతి ఒక్కరూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని తెలిపారు. స‌రూర్‌న‌గ‌ర్‌లోని శ్రీ త్రివేణి పాఠ‌శాల 11వ వార్షికోత్సవానికి ఆయ‌న విశిష్ట అతిథిగా హాజ‌రై ప్రసంగించారు. అంత‌కుముందు పాఠ‌శాల ఛైర్మన్ గోవ‌ర్ధ‌న‌రెడ్డి జ్యోతి ప్రజ్వల‌న‌తో కార్యక్రమం ప్రారంభించారు. న‌ర్సరీ, జూనియ‌ర్ కేజీ, సీనియ‌ర్ కేజీ విద్యార్థులు ఆకాశం నుంచి తార‌లు దిగివ‌చ్చి అంద‌రినీ అల‌రిస్తున్నట్లుగా నృత్యరూప‌కం ప్రద‌ర్శించి అంద‌రినీ అల‌రించారు. అనంత‌రం కొంద‌రు విద్యార్థులు అద్భుత‌మైన యోగాస‌నాలు ప్రద‌ర్శించారు. హైస్కూలు విద్యార్థులు ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ ఆర్మీథీమ్ ప్రద‌ర్శించారు. ఓ మ‌హిళా నీకు జోహార్లు అంటూ మ‌హిళా శ‌క్తిని చాటి చూపారు. ప‌ల్లె జీవితాన్ని ప్రతిబింబిస్తూ, కుటుంబ విలువ‌ల ప్రాధాన్యాన్ని చాటుతూ, స్నేహం ప్రాధాన్యాన్ని తెలియ‌జేస్తూ.. అలాగే సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలంటూ చేసిన ప‌లు ప్రద‌ర్శన‌లు త‌ల్లిదండ్రులను, అతిథుల‌ను ఆక‌ట్టుకున్నాయి. స్టెప్స్ టు స‌క్సెస్ అనే మెడ్లీ డాన్సును చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ప్రద‌ర్శించారు. అనంత‌రం చేసిన ద‌శావ‌తార ప్రద‌ర్శన న‌భూతో అన్నట్లు సాగింది. పాఠ‌శాల ఛైర్మన్ గోవ‌ర్ధన‌రెడ్డి మాట్లాడుతూ, త్రివేణి పాఠ‌శాల ఉన్నతాశ‌యాల‌కు త‌మ మ‌ద్దతు, ప్రేమాభిమానాలు తెలియ‌జేస్తున్న త‌ల్లిదండ్రుల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో విద్యార్థులు అంచెలంచెలుగా ఎదిగేలా పాఠ్య ప్రణాళిక‌ను రూపొందించి, వారి స‌ర్వతోముఖాభివృద్ధికి త‌మ పాఠ‌శాల కృషి చేస్తోంద‌ని చెప్పారు. నేటి బాల‌లే దేశ భ‌విష్యత్తు అని ఆయ‌న కొనియాడారు. కార్యక్రమంలో శ్రీ‌త్రివేణి పాఠ‌శాల‌ డైరెక్టర్ సునీల్‌, ప్రిన్సిపాల్ యోగీశ్వరి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *