పెద్దలకూ టీకాలు అవసరం
1 min read

పలు రకాల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం
50 ఏళ్లు దాటిన తర్వాత తగ్గే రోగనిరోధక శక్తి
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రవితేజ బుద్ధ సూచన
హైదరాబాద్, న్యూస్ నేడు : టీకాలు అనగానే అందరూ చిన్నపిల్లలకు ఇచ్చేవనే అనుకుంటారు. కానీ వాస్తవానికి పుట్టిన శిశువుల నుంచి 95 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ కొన్ని రకాల టీకాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వైద్యులను సంప్రదించి ఎప్పటికప్పుడు తగిన టీకాలు తీసుకోవడం ద్వారా కొన్ని ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ టీకా దినోత్సవం సందర్బంగా ఈ విషయం గురించి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవితేజ బుద్ధ పలు వివరాలు తెలిపారు. ఇమ్యునైజేషన్ అంటే శరీరంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడానికి ఇచ్చే టీకాలు. చిన్నప్పటి నుంచే ఆరోగ్యం కాపాడేందుకు వివిధ రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. శిశువుల నుంచి వృద్ధుల వరకు, 95 ఏళ్ల వయస్సు వరకు కూడా కొన్ని టీకాలు సిఫారసు చేస్తారు. వారికి సరైన సమాచారం కూడా లేకపోవడం వల్ల చాలా మంది టీకాలు వేయించుకోవడం లేదు. 50 ఏళ్లు దాటినవారు, వేరే సమస్యలు ఉంటే ఇంకా ముందుగానే వైద్యులను సంప్రదించి అవసరమైన టీకాలు సమయానికి తీసుకోవాలి. టీకాలు మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తును రక్షించే ముఖ్యమైన ఆయుధం.

