మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి!
1 min readయువ స్పందన ముగ్గుల పోటీ అభినందనీయం
పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు, బహుమతుల ప్రధానం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే మంచి గుర్తింపు వస్తుందని, సంక్రాంతి పండుగ సంబరాలు, ముగ్గులు మన సాంప్రదాయమని పత్తికొండ మాజీ ఎంపిపి ఎస్. నాగరత్నమ్మ, కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహితలు కళ్యాణి, వినుత అన్నారు. ఆదివారం పత్తికొండ పట్టణంలోని సాయిబాబా దేవాలయం ఆవరణలో యువ స్పందన సొసైటీ 9వ వార్షికోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ , జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు కళ్యాణి, వినుత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముగ్గుల పోటీలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ఆకర్షణీయమైన, సాంప్రదాయమైన ముగ్గులను వేశారు. అనంతరం స్థానిక సాయిబాబా దేవాలయం ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ముగ్గుల పోటీలలో పత్తికొండ పట్టణానికి చెందిన ఏ.లిఖిత మొదటి విజేత, ఎ.అంజలి రెండవ విజేత, ఎన్. సురేఖ మూడవ విజేతలుగా నిలిచారు. మొదటి బహుమతి రూ. 5016, రెండవ బహుమతి రూ. 3016, మూడవ బహుమతి రూ. 2016 లను ముఖ్య అతిథులు విజేతలకు అందజేశారు. యువ స్పందన సొసైటీ 9వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులు, యువ స్పందన సభ్యులు కేకును కట్ చేశారు. యువ స్పందన సొసైటీ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలా ఉపయోగకరమైనని అన్నారు. యువ స్పందన సొసైటీ వార్షికోత్సవం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.