ఏపీలో తొలిసారిగా మెదడుకు అత్యాధునిక చికిత్స
1 min readరక్తనాళం పగిలి.. మెదడులో అంతర్గత రక్తస్రావం
55 ఏళ్ల మహిళకు వెబ్ పరికరంతో చికిత్స
అత్యాధునికం.. చాలా ప్రయోజనకరం
కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యుల ఘనత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మెదడులో కీలకమైన రక్తనాళం బాగా ఉబ్బిపోయి, పగిలిపోవడంతో అంతర్గత రక్తస్రావం అయిన ఓ మహిళకు ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా అత్యాధునిక పరికరంతో చికిత్స చేసి, కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలిస్టు డాక్టర్ కసిరెడ్డి అశోక్ రెడ్డి తెలిపారు.“కర్నూలు ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల గృహిణి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు వెంటనే తగిన పరీక్షలు చేసి పరిశీలించగా, మెదడులో ఉండే ఒక పెద్ద యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టెరీ అనే రక్తనాళం ఉబ్బిపోయి, పగిలినట్లు గుర్తించాం. ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఇలాంటివాటికి ఇంతకుముందు శస్త్రచికిత్స చేసి క్లిప్పింగ్ లేదా కాయిలింగ్ లాంటివి చేసేవాళ్లం. కానీ ఈ రోగిలో పగులు బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఆ విధానాలతో పూర్తి ఫలితం వచ్చే అవకాశాలు తక్కువ. దాంతో రాష్ట్రంలోనే తొలిసారిగా వెబ్ అనే అత్యాధునిక పరికరాన్ని ఉపయోగించి చికిత్స చేయాలని నిర్ణయించాం. శస్త్రచికిత్స అవసరం లేకుండా చిన్న రంధ్రంతోనే ఈ పరికరాన్ని అమర్చడంతో పగిలిన రక్తనాళాన్ని అతికించి, రక్తప్రసారం సాధారణంగా ఉండేలా చూడగలిగాం. ఈ టెక్నిక్‌లో అనేక సానుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా చికిత్సలో రిస్క్ తక్కువగా ఉంటుంది, సమయం తక్కువ పడుతుంది, రోగి త్వరగా కోలుకుంటారు. ఈ కేసులో సావిత్రి కోమా దశకు చేరుకోవడానికి ముందే కేవలం తీవ్రమైన తలనొప్పితోనే రావడం ఒక సానుకూలత. ఇలాంటి సందర్భాల్లో చాలామంది కోమాలోకి వెళ్లిపోతారు. ముందుగానే రావడం వల్ల ఆమెకు త్వరగా నయమైంది. వెబ్ పరికరం అమర్చిన రెండోరోజే ఆమె నడవగలిగారు. ఇంత అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేసినందుకు ఎంతో గర్విస్తున్నాం. రాష్ట్రవాసులకు.. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వారికి ప్రపంచస్థాయి వైద్య పరిజ్ఞానంతో అత్యాధునిక సేవలు అందించగలుగుతున్నాం. ఇలాంటి సంక్లిష్టమైన మెదడు చికిత్సలను కూడా చేయగల నైపుణ్యం, ఆధునిక పరికరాలు కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. దేశంలో అతి కొద్ది కేంద్రాల్లో మాత్రమే ఇలాంటివి ఉన్నాయి” అని డాక్టర్ అశోక్ రెడ్డి వివరించారు.