సీఎం చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్ధిక భరోసా
1 min readనంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమని, వేలాది మంది తెలుగు వారు కలిసి పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అని, విశాఖ ఉక్కు పరిశ్రమను పునరుజ్జీవింప జేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
మంగళవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఓ ప్రకటనలో తెలుపుతూ
నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండని, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టుపెడతానని గత సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేవారని, నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తునే ఉందని, నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ ఆమోద ముద్ర వేసిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే, విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని సీఎం చంద్రబాబు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ఆమె అన్నారు.ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్ధ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పుల్లో కూరుకుపోయిందని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ఉమ్మడి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రూ.18 వేల కోట్లైన అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు, ఎంపీ భరత్ తదితరులు విన్నవించిన కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు రూ.500 కోట్లు, ముడి సరుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు రూ.1,150 కోట్లు చొప్పున మొత్తం రూ.1,650 కోట్లను రెండు విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం అందించిందని, నేడు స్టీల్ ప్లాంట్ ను సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు కృషికి ఫలితంగా రూ.11,440 కోట్లు సాయాన్ని కేంద్ర ప్రకటించడం అభినందనీయమని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.1994లో నష్టాల పేరుతో బీఐఎస్ఆర్ ప్రమాదం ఏర్పడితే.. దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా.. ప్లాంట్లను అమ్మడానికి ప్రయత్నించిందని . అందుకు ఎర్రన్నాయుడు నేతృత్వంలో టీడీపీ ఎంపీలు పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. 1998లో నాటి ప్రధాని అటల్ బిహారి వాజిపేయ్ తో మాట్లాడి రూ.1,650 కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారని, కేంద్ర ప్రభుత్వమిచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చాలని, రుణంపై వడ్డీని మాఫీ చేసి బీఐఎఫ్ఆర్కు వెళ్ళకుండా తప్పించాలని టీడీపీ ఎంపీలు కోరడంతో నాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ రూ.1,333 కోట్ల రుణాన్ని ఈక్వీటీగా మార్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమగ్రాభివృద్ధి కోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారని, ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని, 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం జరిగిందని ఆమె వివరించారు. అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది… నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది సీఎం చంద్రబాబే నని, తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.