విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు చెప్పినమాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
1 min readవిశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం
దేశ ఆర్ధిక ప్రగతికి విశాఖ స్టీల్ దోహదం చేసింది
ఎపి పారిశ్రామిక వృద్ధికి గమ్యం అని కేంద్రం నమ్ముతుంది
చంద్రబాబు హాయాంలో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తోంది
కేంద్ర ప్రభుత్వానికి ఉక్కుశాఖా మంత్రికి ధన్యవాదాలు
రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరోధించడం కూటమి ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం పాత్రికేయుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యంతో లక్షకు పైగా ప్రజలకు ఉపాధి అందిస్తూ, 22 వేల ఎకరాలలో నిర్మించిన విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సెంటిమెంట్ అన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడిందని, ఈ ఉద్యమంలో 30 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఆ రోజుల్లో అతి పెద్ద ఉద్యమమమన్నారు. 1992 లో ప్రారంభమైన విశాఖ ఉక్కు కర్మాగారం దేశ ఆర్ధిక ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఎంతో గొప్ప టెక్నాలజీ తో, నైపుణ్యం కలిగిన కార్మికులతో ప్రగతిపధంలో నడిచిన విశాఖ ఉక్కు ను కేంద్రప్రభుత్వంలో ఎకనామిక్ అఫైర్స్ కమిటీ నష్టం వస్తున్నదన్న కారణంతో నూరుశాతం ఈక్విటీ షేర్లు ఉపసంహరణకు ప్రయత్నించిందన్నారు. ఆ సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలు, తెలుగుదేశం, జనసేన, విశాఖ ఉక్కు కార్మికులు వ్యతిరేకించారన్నారు. విశాఖ ఉక్కు ఉద్యోగులు 1500 రోజులపాటు చేసిన ఉద్యమం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కారణంగా లక్ష ఉద్యోగ కుటుంబాలు రోడ్డున పడతాయని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం విరమించుకోకుంటే సదరు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నడపాలని 2021లో లోకేష్ ఉద్యమం చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ లో 22 ఎంపీల బలమున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికి, ఎన్నో సార్లు ఢిల్లీ పర్యటనలు చేసి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తమ స్వంత ప్రయోజనాలు నెరవేర్చుకున్నారన్నారు.నేడు మళ్ళీ ప్రధాని మోడీ గారికి ఆంధ్రుల సెంటిమెంట్ వివరించి, ప్రైవేటీకరణ ఆపించి, ఆర్థిక ప్యాకేజీ వచ్చేలా చేసిన సిఎం శ్రీ నారా చంద్రబాబునాయుడు వారికి కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు. సమావేశంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధ కృష్ణయ్య (చంటి), ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ప్రభృతులు పాల్గొన్నారు.