రహదారి భద్రతా నియమాలపట్ల విద్యార్థులు అవగాహన కలిగిఉండాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2025 సందర్భంగా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ సెమినార్ హాలులోనిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రహదారి భద్రతకు సంబంధించిన అవగాహనా కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి నెలంతా నిర్వహిస్తున్నాయన్నారు. అందులో భాగంగా వర్సిటీలో అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ విభాగాన్ని ఆచార్య నాయక్ అభినందించారు. రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో అధికశాతం యువతేనన్న విషయాన్ని గమనించుకొని ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం. నరేష్ రహదారి భద్రతకు సంబంధించి విద్యార్థులకు వివిధ సూచనలు చేశారు. ఆధునిక వాహనాలు వేగవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అపాయం తప్పదన్నారు. చిన్నచిన్నపొరపాట్లుకూడా ప్రాణాపాయానికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. వర్సిటీ క్యాంపస్లోకూడా విద్యార్థులు క్రమశిక్షణతో వాహనాలు నడపాలని వర్సిటీ సైన్స్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి సూచించారు. రహదారి ప్రమాదాల నివారణకు నిపుణుల సూచనలను ప్రతిఒక్కరూ పాటించాలని వర్సిటీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. నరసింహులు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం ఏవిధంగా రహదారి ప్రమాదాలకు కారణమవుతుందో వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ వై. హరిప్రసాదరెడ్డి వివరించారు. రహదారి భద్రతగురించి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజలకు అవగాహన కలిగించాలని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు తెలిపారు. ఈదిశగా వర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లోకూడా అవగాహనా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డితోపాటు విద్యార్థిని విద్యార్థులు, పరిశోధకవిద్యార్థులు, వివిధ విభాగాల అధ్యాపకులు, ఆచార్యులు పాల్గొన్నారు.