సూపర్ సిక్స్ పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నాం
1 min readటెక్స్ టైల్ పార్క్, నేషనల్ హైవే, రైల్వే లైన్ ప్రాజెక్టులను తీసుకొస్తున్నాం_
వాట్సప్ పరిపాలన ద్వారా ప్రజలకు 161 సేవలు అందుబాటులో
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు ప్రజలు ఎవ్వరూ నమ్మస్థితిలో లేరని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని స్థానిక 4వ వార్డు, 23వ వార్డులో ఆయన పర్యటించి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఏ రోడ్డు చూసిన నా తండ్రి మాజీమంత్రి బీవీ మోహన్ రెడ్డి గుర్తుకొస్తారని, సంక్షేమం, అభివృద్ధి దశగా ముందుకు పోతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. 4వ వార్డులో 30 ఏళ్లుగా రోడ్డు సమస్యకు పరిష్కారం చూపి కొత్త రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల కాళ్లల్లో ఆనందం చూడడం జరిగిందన్నారు. అలాగే టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు అయితే యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు, చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఈ పార్కు స్థలాన్ని పట్టాలిచి నాశనం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 77 ఎకరాలలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు మంజూరు చేసి తీసుకొచ్చానని పేర్కొన్నారు. అలాగే మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు అందిస్తామని, దీని ద్వారా ఎంతమంది మగ్గం వేస్తున్నారో తెలుస్తుందన్నారు. పాత పద్ధతి డిజైన్లు కాకుండా కొత్త డిజైన్లు కొరకు కార్మికులకు శిక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే జి ప్లస్ త్రీ గృహల దగ్గర తాత్కాలికంగా కార్మికులకు మగ్గం నేసేందుకు చేనేతశాల 1 ఎకరాలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు అన్ని అమలు చేసి తీరుతామని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అతి త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలు ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అలాగే కర్నూలు వయా మంత్రాలయం మీదుగా ఎమ్మిగనూరుకు రైల్వే లైన్ అప్రూవల్ కు తొలి అడుగు పడిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. మరో పక్క ఎమ్మిగనూరు – కర్నూల్ నేషనల్ హైవేగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమ, రైలు, నేషనల్ రోడ్డు వస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన వాట్సప్ పరిపాలన ద్వారా ప్రజలందరికీ 161 సేవలు వారి చేతిలోనే ఉంటాయని, సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆలోచనతో వాట్సప్ పరిపాలన తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ గంగిరెడ్డి, టీడీపి కౌన్సిలర్లు, వార్డు ఇన్ చార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.