సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవాలు అందుబాటులోకి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో హెచ్ డి సి టి మరియు సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా కేంద్రంలో ఎక్సరే, రక్త పరీక్ష సేవలు ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చాయి. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల కంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యాలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎక్సరే, రక్త పరీక్షా కేంద్రాన్ని సేవా భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్ఎస్ఎస్ నగర సంఘ్ చాలక్ డాక్టర్ వాసు రెడ్డి, డాక్టర్ అనంత్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతమాత చిత్రపటానికి పూల మాలార్పణ అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అశ్విని ఆసుపత్రి అధినేత, సేవా భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హెచ్ డి సి టి, సేవా భారతి ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ నగర సంఘ్ చాలక్ డాక్టర్ వాసు రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ ఆసుపత్రి అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. వైద్య సేవలతో పాటు అందుబాటులోకి వచ్చిన ఎక్సరే, రక్త పరీక్ష సర్వీసులను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన సేవా భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. సేవ పొందే వారు కూడా భవిష్యత్తులో సేవలు అందించేలా తయారు కావాలన్నది సేవా భారతి లక్ష్యమని ఆయన వివరించారు. క్షయ వ్యాధి నివారణ కొరకు కర్నూలు జిల్లాలో మొబైల్ వాహనము గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు సేవ చేస్తోందని ఆయన చెప్పారు. కరోనా సమయంలో సేవా భారతి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని ఆయన వివరించారు. హెచ్ డి సి టి, సేవా భారతి ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చిన ల్యాబ్ సర్వీసులను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అతి తక్కువ ఖర్చుతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సీతారాం, డాక్టర్ అనంత్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ ఇందిర, హెచ్ డి సి టి నిర్వాహకులు దిలీప్, అమిత్, నలిన్ తదితరులు పాల్గొన్నారు.