NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోటీ ప్రపంచంలో నిలదొక్కుకొనే నైపుణ్యాలను ప్రతిఒక్కవిద్యర్థి అందిపుచ్చుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  పోటీప్రపంచంలో నిలదొక్కుకొనే నైపుణ్యాలను ప్రతిఒక్కవిద్యర్థి అందిపుచ్చుకోవాలని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. వర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఈరోజు జరిగిన పీజీ & యూజీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతిఒక్క విద్యార్థి క్రమశిక్షణతో మెలుగుతూ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేవిధంగా తయారవాలని ఆయన ఆకాంక్షించారు. యూనివర్సటీలో నిపుణులైన అధ్యాపకుల సూచనలు, సలహాలతోపాటు, లైబ్రరీ, ల్యాబులు, ఆటస్థలం మొదలైన వసతులను సద్వినియోగం చేసుకోవలసినదిగా నూతన విద్యార్థులకు ఆయన హితవు పలికారు. చదువుతోపాటు జాతీయ సేవాకార్యక్రమాలు, ఆటపాటల్లోనూ రాణిస్తూ విద్యార్థులంతా వృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యసాధనకు ప్రతిఒక్కవిద్యార్థి కృషిచేయాల్సిందిగా ఆచార్య బసవరావు పిలుపునిచ్చారు. విభిన్న ప్రాంతాలు, వివిధ నేపథ్యాలనుండి విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ జూనియర్ విద్యార్థులు మధ్య ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలుండాలన్నారు. వర్సిటీలో చేరిన ప్రతివిద్యార్థి తన కోర్సు పూర్తయి బయటికి వెళ్లే సమయానికి కుటుంబానికి అండగా నిలవాలని వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ ఆకాంక్షించారు. వర్సిటీ క్యాంపస్లో ర్యాగింగ్ ఏరూపంలోకూడా ఉండకూడదని ఎవరైనా అనవసర విషయాల్లో తలదూరిస్తే తర్వాత బాధపడాల్సివస్తుందని ఆయన హితవు పలికారు. వర్సిటీలో ఈ సంవత్సరం నూతనంగా యూజీ కోర్సులనుకూడా ప్రారంభించడంవల్ల అదనంగా దాదాపు 80 మంది విద్యార్థులకు చదువుకునే సౌకర్యం కలిగిందని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు హర్షంవ్యక్తంచేశారు. సీనియర్లతో సమన్వయంచేసుకుంటూ జూనియర్ విద్యార్థులు పురోగతి సాధించాలన్నారు. యూనివర్సిటీలో చదువుతున్న ప్రతివిద్యార్థి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author