ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
1 min readజిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిఐఈఓ సునీత, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబంధిత పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ లకు డిప్యూటీ తాసిల్దారులను కేటాయించాలని డిఆర్ఓ ను ఆదేశించారు. పరీక్షలు నిర్వహిస్తున్న 64 పరీక్షా కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని డిఎంఅండ్హెచ్ఓ ను ఆదేశించారు. సంబంధిత పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి 14,274 మంది జనరల్ విద్యార్థులు, 1418 ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 15,692 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ కు సంబంధించి 12,271 మంది జనరల్ విద్యార్థులు, 1129 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 13,400 విద్యార్థులు హాజరవుతున్నారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్, తాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 5 నుండి 20 వ తేదీ వరకు జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు కూడా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చేందుకు నిర్ణీత వ్యవధిలో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపాలలో జిరాక్స్ మిషన్లను మూసి వేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.