ఇందన పొదుపుతో భావితరాలకు మంచి భవిష్యత్
1 min readజాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో పాల్గొన్న శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,
చింతమనేని ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీని శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ లతో కలిసి జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి జెండాఊపి ప్రారంభించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ఆర్.ఆర్. పేటలోని విద్యుత్ భవనం వరకు విద్యార్ధులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందనపొదుపై అవగాహన కలిగించే పోస్టర్లను, కరపత్రాలను ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య(చంటి), జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఇందనాన్ని పొదుపుచేయడం ద్వారా భావి తరాలకు మంచి భవిష్యత్ ను ఇవ్వవచ్చని అవసరమైన సమయంలోనే విద్యుత్ ఉపయోగించుకోవడం ద్వారా విద్యుత్ ను ఆదా చేయాలని సూచించారు. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతిఒక్కరిదని ఆమె స్పష్టం చేశారు. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కలిగించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20 వరకు జాతీయ ఇందన పొదపు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ భావితరాల అభివృద్ధికోసం ప్రతిఒక్కరూ విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలన్నారు. ఇంధనపొదుపుపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగివుండాలన్నారు. సూర్య ఘర్ లాంటి పధకాల ద్వారా లబ్దిపొందాలని సూచించారు. గృహోపయోగాలకు స్టార్ రేటెడ్ ఉన్న ఎల్.ఇ.డి బల్పులు, నాణ్యమైన విద్యుత్ పరికరాలను కొనుగోలు చేసుకుని వినియోగించుకోవాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయాలని, సోలార్ ఇంధనపధకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డబ్బును పొదుపుచేసుకునే విధంగానే విద్యుత్ ను కూడా అవసరాలమేరకు విద్యుత్ ను పొదుపు చేసుకోవాలని సూచించారు. ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు మాట్లాడుతూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ వినియోగంపై గ్రామాల్లో జానపధ కళాకారులు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలతో విస్త్రృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులకు వ్యాసరచన, వక్త్రృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామని, అదే విధంగా స్వయంసహాయ సంఘాల మహిళా బృందాలతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిఇ కె.ఎం. అంబేద్కర్, డిఇఇ పి. రాజకుమారి, ఎఇ పి. ప్రసన్నవల్లి, డిఇఇ బి.వి. కృష్ణరాజ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, సిబ్బంది, విద్యార్ధినీ, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.