నాలుగేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన కిడ్నీ వ్యాధి
1 min read* ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 200 లిపోప్రోటీన్ గ్లోమెరులోపతీ కేసులు
* అన్నీ ఎక్కువగా చైనా, జపాన్ దేశాల్లోనే.. అదీ పెద్దవాళ్లకే
* ఇంత చిన్నవయసులో రావడం ప్రపంచంలోనే తొలిసారి
* దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి కేసు
* సరైన చికిత్సతో నయంచేసిన కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచంలోనే అత్యంత అరుదైన కిడ్నీ వ్యాధి కర్నూలులో వెలుగు చూసింది. సరైన సమయానికి వ్యాధిని సరిగ్గా గుర్తించడంతో రోగికి కచ్చితమైన చికిత్స చేసి ఊరట కల్పించిన ఘనత కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ కె. అనంతరావుకు దక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
“కర్నూలు నగరానికి చెందిన నాలుగేళ్ల బాలుడు గత రెండు నెలలుగా కాళ్లు, ముఖం వాపుతో ఇబ్బంది పడుతున్నాడని ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొన్ని పరీక్షలు చేయగా మూత్రంలో ప్రోటీన్ లీకేజి కనిపించింది. దాంతో దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్‌గా భావించారు. దాంతో స్టెరాయిడ్స్ చికిత్స మొదలుపెట్టారు. కానీ దానివల్ల ఫలితం లేకపోవడంతో నా వద్దకు పంపారు. ఇది స్టైరాయిడ్‌కు లొంగని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని డయాగ్నైజ్ చేశాము. దాంతోపాటు.. రక్తంలో కొలెస్టరాల్ స్థాయి అసాధారణంగా పెరిగిపోవడాన్ని గుర్తించాము. సీరం కొలెస్టరల్ 250 ఎంజీ/డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ 950 ఎంజీ/డీఎల్ చొప్పున ఉన్నాయి. ఇది చాలా అసాధారణం. దాంతో కిడ్నీ బయాప్సీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ చేసి చూడగా అప్పుడు ఆ బాలుడికి వచ్చినది ప్రపంచంలో అత్యంత అరుదైన లిపోప్రోటీన్ గ్లోమెరులోపతీ అని గుర్తించాము. దక్షిణ భారతదేశంలో ఇదే మొట్టమొదటి కేసు. దాంతో జన్యుపరీక్షలు చేయగా, ఏపీఓఈ అనే జన్యువు మ్యుటేషన్ జరిగినట్లు తెలిసింది. ఇలాంటి మ్యుటేషన్ కూడా దేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఈ వ్యాధిని గుర్తించడంతో ముందుగా స్టెరాయిడ్ చికిత్స ఆపేసి, లిపోప్రోటీన్ గ్లోమెరులోపతీని నియంత్రించే మందులు వాడాం. దాంతో అప్పటినుంచి క్రమంగా కొలెస్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయి తగ్గడంతో పాటు మూత్రంలో ప్రోటీన్ లీకేజి కూడా ఆగింది. సరైన సమయానికి ఈ వ్యాధిని గుర్తించి, దానికి తగిన చికిత్స చేయకపోతే ఇలాంటి కేసుల్లో పూర్తిగా కిడ్నీ విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ అనంతరావు వివరించారు.
ఏమిటీ వ్యాధి?
లిపోప్రోటీన్ గ్లోమెరులోపతీ అనేది అత్యంత అరుదైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కేవలం 200 కేసులు మాత్రమే బయటపడ్డాయి. అవి కూడా చైనా, జపాన్ దేశాల్లోని పెద్దలకు మాత్రమే వచ్చాయి. ఈ రెండు దేశాల వెలుపల రావడం కూడా చాలా తక్కువ. దక్షిణ భారతదేశం మొత్తమ్మీద ఇదే మొట్టమొదటి కేసు. పైగా ఇప్పటివరకు ఇది పెద్దల్లో మాత్రమే బయటపడింది. ఇంత చిన్న వయసులో రావడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి సారి. ఏపీఓఈ జన్యు మ్యుటేషన్ వల్లనే కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి, అవి కిడ్నీలో పేరుకుపోయి, దానివల్ల మూత్రంలో ప్రోటీన్ లీకేజి, కిడ్నీ వైఫల్యం సంభవిస్తోంది. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే దానికి అంత సమర్థమైన చికిత్స చేయొచ్చు. డాక్టర్ అనంతరావు ఇప్పటివరకు 800కు పైగా కిడ్నీ బయాప్సీలు చేశారు. అరుదైన కిడ్నీ వ్యాధులు, మూత్రపిండాల మార్పిడి లాంటి సేవల కోసం కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోని నెఫ్రాలజీ విభాగం పేరెన్నికగన్నది.