ఉస్మానియా కళాశాల పూర్వ విద్యార్థి కి ఘన సన్మానం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ఉస్మానియా కళాశాలలో చదువుతూ ఎన్సిసి శిక్షణను పొంది దేశంలోనే అతి కఠినమైన శిక్షణ పొంది ఎన్.ఎస్.జి బ్లాక్ క్యాట్ కమాండో సర్టిఫికెట్ ను పొందిన ఎద్దుల నరేష్ కళాశాలకే కాదు, దేశానికే గర్వకారణమని ఉస్మానియా కళాశాల కార్యదర్శి మరియు కరస్పాండెంట్ శ్రీమతి.అజ్రా జావిద్ అన్నారు. ఆమె నేడు ఉస్మానియా కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఏర్పాటుచేసిన పూర్వ విద్యార్థి సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశానికి ఇలాంటి సైనికుడిని ఇచ్చిన నరేష్ తల్లిదండ్రుల జీవితం ధన్యమని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సమీవుద్దిన్ ముజమ్మిల్ మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే ధైర్య సాహసాలను కలిగి ఉండి, గురువులపై గౌరవంతో కళాశాలకు వచ్చిన పూర్వ విద్యార్థి నరేష్ నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఉస్మానియా కళాశాల ప్లేస్మెంట్ అధికారి, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్.మండి అన్వర్ హుస్సేన్ మాట్లాడుతూ, తాను ఎన్సిసి అధికారిగా ఉన్నప్పుడు ఎద్దుల నరేష్ ఎన్సిసి లో చేరాడని. విద్యార్థి దశలోనే మంచి శరీర దారుఢ్యం కలిగి దాదాపు 40 క్యాంపు లలో పాల్గొన్నాడని. పేదరికాన్ని జయించి ఇతరులకు ప్రేరణగా నిలిచాడని నరేష్ ను అభినందించారు. బ్లాక్ క్యాట్ కమాండో ఎద్దుల నరేష్ ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.సన్మానితుడై నరేష్ భావోద్వేగంతో తను చదివిన కళాశాలలో ఇంత గొప్ప సన్మానాన్ని పొందటం నా జీవితంలో మరిచిపోలేని సంఘటనని, తల్లిదండ్రి గురువు దైవం అనే సూత్రాన్ని తాను నమ్ముతానని, అందరికీ దేవుడు ఒక్కడేనని. గురువు సరైన దిశా నిర్దేశం చేస్తాడని, అలాంటి గురువుల వల్లనే తాను ఈనాడు ఈ స్థితికి చేరుకోగలిగానని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధ్యాపకులు ,విద్యార్థులు పాల్గొన్నారు.