ఉపాధ్యాయుడిని దుర్భాషలాడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి… ఏపీటీఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ గడవేముల: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కొరమానుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశులు ను దుర్భాషలాడి, దాడికి ప్రయత్నించిన గ్రామానికి చెందిన విజయభాస్కర్ రెడ్డిని, అతని అనుచరుడిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి. శ్రీనివాసులు జిల్లా ఉన్నత స్థాయి అధికారులను డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ గడివేముల మండల శాఖ అధ్యక్షుడు ఎం. ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ విధి నిర్వహణలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో కొలిమిగుండ్ల మండలం, కొరుమానుపల్లి గ్రామానికి చెందిన చౌక దుకాణం డీలర్ విజయభాస్కర్ రెడ్డి పాఠశాలకు వచ్చి రేషన్ బియ్యం పాఠశాల తరగతి గదిలో భద్రపరుచుకుంటానని అడుగగా ఎంఈఓ గారిని అడుగుతానని ఉపాధ్యాయుడు చెప్పగా ఆవేశంతో డీలర్ విజయ భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయుడు వెంకటేశులును పత్రికల్లో రాయలేని విధంగా బండ బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించి, భయభ్రాంతులకు గురి చేయడం అనాగరిక చర్య అని ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఉపాధ్యాయుడు వెంకటేశులు కన్నీళ్లు పెట్టుకుని మానసిక ఒత్తిడికి గురయ్యారని, సంఘటన కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పవిత్రమైన వృత్తిలో ఉండే ఉపాధ్యాయులను గౌరవించ పద్ధతి ఇదేనా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విచారణ జరిపి విజయ భాస్కర్ రెడ్డిని అతని అనుచరుడి పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఉపాధ్యాయుడికి రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. లేనిపక్షంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో మరియు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి పోరాటాల ద్వారా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ గడివేముల మండల శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్. బాలస్వామి జిల్లా మహిళా కార్యదర్శి యు. కవిత సీనియర్ నాయకులు రాంపుల్లారెడ్డి, మారెన్న, శ్రీరాములు, ఆదిశేషమ్మ, చంద్రావతి, పుష్పకుమారి, ప్రసన్నలక్ష్మి, లక్ష్మీదేవి, లలితమ్మ, మల్లికార్జునయ్య, శేషన్న తదితరులు పాల్గొన్నారు.