ప్రతి ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలి..
1 min readబహిరంగ మలవిసర్జన సామాజిక దురాచారం
వ్యక్తగత పరిశుభ్రత పాటించాలి
పారిశుధ్య కార్మికులను సత్కరించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు వినియోగించాలని, బహిరంగ మలవిసర్జన నివారించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. సత్కారం పొందిన వారిలో ఏలూరు కార్పోరేషన్ కు చెందిన యం. దుర్గారావు, జి.రంగారావు ఉన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మరుగుదొడ్డి అనేది ఆత్మగౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ నెల 19 నుండి డిశంబరు 10 వరకు హమారా సౌచాలయ్ – హమారా సమ్మాన్ అనే నినాదంతో జిల్లా అంతటా రోజుకో కార్యక్రమాన్ని జరుపుటకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. గ్రామాల్లో సామాజిక మరుగుదొడ్ల యొక్క నిర్వహణ, వాడకంపై గ్రామాల్లో సర్వే నిర్వహించడం జరిగిందని, టాయిలెట్ లేనివారికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. డిశంబరు 5వ తేదీ వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లు వాడకంపై పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్ధాయిలో ప్రభుత్వ సంస్ధలైన అంగన్వాడీలు, పాఠశాలలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు తదితరాల్లో మరుగుదొడ్లు పనివిధానం, వాటికి నీటి సదుపాయం ఉందీ లేనిదీ పరిశీలించడం జరుగుతుందన్నారు. డిశంబరు 10వ తేదీ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.అదే విధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని మన ఆరోగ్యం కోసం పాటుపడే పారిశుధ్య కార్మికులను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూఎస్ఇ ఇన్ చార్జి త్రినాధ్ బాబు తదితరులు పాల్గొన్నారు.