మూడేళ్ల చిన్నారికి అత్యంత అరుదైన సమస్య
1 min read* ఎడమవైపు రెండుగా విడిపోయిన కిడ్నీ
* తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో పాడైన పై భాగం
* మూత్రం లీక్ అవడంతో తీవ్రమైన సమస్య
* లాప్రోస్కొపీ సర్జరీతో పాడైపోయిన పైభాగాన్ని జాగ్రత్త తొలగించిన డాక్టర్. మనోజ్ కుమార్
* కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సాధారణంగా అందరికీ రెండు మూత్రపిండాలే ఉంటాయి. కానీ, కర్నూలు జిల్లాకు చెందిన ఒక మూడేళ్ల బాలికకు అత్యంత అరుదైన సమస్య ఏర్పడింది. ఆమె ఎడమవైపు ఉండాల్సిన మూత్రపిండం రెండుగా విడిపోయింది. అందులో ఒకటి పైన, మరోటి కింద ఏర్పడ్డాయి. మామూలుగా కింది భాగం 85 శాతం పనిచేస్తుండగా, పై భాగం 15శాతం మాత్రమే పని చేస్తుంది. అయితే, అందులో కూడా తీవ్ర సమస్య ఏర్పడింది. దీనివల్ల ఆమెకు మూత్రకోశంలోకి వెళ్లాల్సిన మూత్రం కాస్తా మూత్ర నాళాల్లోకి లీక్ అవ్వడం మరియు యూట్రర్ బ్లాక్ అవడంతో కిడ్నీ వాపు వచ్చింది. దానివల్ల ఆమెకు జ్వరం రావడం, నియంత్రణ లేకుండా మూత్రవిసర్జన అయ్యి దుస్తులు తడిసిపోవడం లాంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ చిన్నారికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన యూరాలజీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు, సంతాన సాఫల్య నిపుణుడు, లాప్రోస్కొపిక్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ వై. మనోజ్ కుమార్ తెలిపారు. “మూడు సంవత్సరాల వయసున్న ఈ చిన్నారికి అత్యంత అరుదైన సమస్య వచ్చింది. ఎడమవైపు మూత్రపిండం రెండుగా విడిపోయి, ఒకదానిపై ఒకటి చేరింది. పైన ఉన్న మూత్రపిండం మామూలుగా 15% పనిచేస్తోంది. అందులో కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దానివల్ల ఆమెకు పదే పదే జ్వరం రావడం, దుస్తుల్లోనే మూత్రవిసర్జన అవుతుండటంతో తల్లిదండ్రులు మొదట చిన్న ఆస్పత్రులలో చూపించి, అక్కడ ఫలితం లేకపోవడంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆమెను పరీక్షించిన తర్వాత స్కాన్లు చేయగా అప్పుడు అసలు విషయం తెలిసింది. పై భాగంలో ఉన్న మూత్రపిండం బాగా వాచిపోయి, ఇన్ఫెక్ట్ అయ్యి, పూర్తిగా పనిచేయని పరిస్థితికి చేరింది. దానికితోడు మూత్రకోశంలోకి వెళ్లడానికి బదులు మూత్రనాళాల్లోకి మూత్రం లీక్ అవుతోంది. దానివల్లే ఆమెకు జ్వరం రావడం, ఇతర సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితులన్నీ గమనించిన తర్వాత ఆ చిన్నారికి పై భాగంలో పాడైపోయిన మూత్రపిండాన్ని తీసేయాల్సి ఉంటుందని తేల్చాం. అయితే, పాప వయసు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కావడంతో లాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. కేవలం రెండు చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే చేసి, శస్త్రచికిత్స చేసి… పాడైపోయిన మూత్రపిండాన్ని తొలగించాం. ఈ శస్త్రచికిత్స చేయడానికి చాలా కష్టమైనది. ఎందుకంటే రెండు కిడ్నీలు ఒకదానితో ఒకటి అత్తుకుని ఉన్నాయి. దీనివల్ల పై కిడ్నీ తీసేసేటప్పుడు కింద కిడ్నీకి ప్రమాదం జరగకుండా తొలగించాలి. అది కూడా లాపరోస్కోపీతో కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేయాల్సి వచ్చిందని డాక్టర్. మనోజ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కిందివైపు ఉన్న మూత్రపిండం ఇప్పుడు బాగా పనిచేస్తోంది.చిన్నారి ఇప్పుడు పూర్తిగా కోలుకుని చురుగ్గా ఉంది” అని డాక్టర్ మనోజ్ కుమార్ వివరించారు.