అపహరించబడిన బాలుడు క్షేమంగా లభ్యం…
1 min readబాలుడు ఆచూకి కృషి చేసిన పోలీసులను అభినందించిన …. కర్నూలు జిల్లా ఎస్పీ
గుట్టు రట్టు అవుతుందని తల్లిదండ్రుల ఇంటి వద్దే బాలుడిని వదిలి వెళ్ళిన దుండగలు.
నిందితుల కోసం గాలింపు చర్యలకు ఆదేశం.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత నెల 20 వ తేదీన కర్నూలు నాలుగవ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ ఎట్టకేలకు సుఖాంతం అయిందని, బాలుడు క్షేమంగా లభించాడని కర్నూలు డిఎస్పి జె. బాబు ప్రసాద్ తెలిపారు. బాలుడి తల్లిదండ్రులను ఆదివారం కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిపించి బాలుడిని వారికి అప్పగించారు. ఈ సందర్భంగా బాలుడి కిడ్నాప్ కేసు వివరాలను కర్నూలు డి ఎస్పీ వెల్లడించారు. డిల్లీ ప్రాంతం నుండి వచ్చి కర్నూల్ – కోడుమూర్ శివార్లలో గుడిసెలు వేసుకొని రోడ్డు పై పిల్లల బొమ్మలు అమ్ముకొని జీవించే ఆజిత్ రాథోడ్, అతని భార్య ఆశా, తన పిల్లలతో కలసి జీవిస్తున్నారు.గత నెల 20 వ తేదీన అర్ధ రాత్రి గుడిసెలో నిద్రిస్తుండగా వారి 8 నెలల చిన్న కొడుకు ఆకాష్ రాథోడ్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం లోని పోలీసు అధికారులందరూ బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆవకాశం ఉన్న అన్నీ ప్రాంతాల లోని సీసీ కెమెరాలను పరీశీలించారు. అనుమానిత మొబైల్ నెంబర్ లను సేకరించి విచారిస్తూ, అనుమానిత వ్యక్తులను తనీఖీ లు చేస్తూ, కర్నూలు జిల్లాతో పాటు కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు.కిడ్నాప్ అయిన బాలుడు పోలీసు చర్యల పలితముగా గత రాత్రి సుమారు 11 గంటల ప్రాంతములో తప్పిపోయిన బాలుడు ఆకస్మికముగా తల్లి దండ్రుల ఇంటి కి దగ్గరలో క్షేమముగా కనిపించాడు. పిల్ల వాడిని తన తల్లి దండ్రుల వద్దనే వదిలి పారిపోయినట్లు ప్రాథమికముగా తెలుస్తుంది. జిల్లా ఎస్పీ కి, కర్నూలు పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు , బంధువులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అయినప్పటికి కిడ్నాప్ చేసిన నిందితుల కోసం పోలీసులు తీవ్రముగా గాలింపు చర్యలు చేపట్టినట్లు మరియు కిడ్నాప్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు నిర్విరామ దర్యాప్తు చేసిన కర్నూల్ IV టౌన్ సిఐ మధుసూధన్ గౌడ్ ని, SI చంద్రశేఖర్ లను మరియు ఈ గాలింపు చర్యలలో భాగమయిన ఇతర పోలీసు అధికారులను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ , కర్నూలు DSP జె. బాబు ప్రసాద్ ఆభినందించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను త్వరగా పట్టుకొమ్మని సంబందిత పోలీసు అధికారులను కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆదేశించారు.