మానసికంగా దృఢంగా ఉంటేనే విజయాన్ని సాధించగలుగుతారు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మానసికంగా దృఢంగా ఉంటేనే విజయాన్ని సాధించగలుగుతారని ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ హిప్నో తెరపిస్ట్ సిరిగిరెడ్డి జయారెడ్డి అన్నారు. రేపు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్. ఏ .పి క్యాంపు లోని సి. ఆర్ .ఆర్ ఎం మున్సిపల్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్,విద్యా హిప్నాటిజం సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో యువత ఆత్మస్థైర్యంతో విజయాన్ని సాధించడం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు సిరిగిరెడ్డి జయారెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారి ప్రవర్తనను గుర్తించి తల్లిదండ్రులు వారిని వెంటనే మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకొని రాగలిగితే వారిని హిప్నో థెరపీ ట్రీట్మెంట్ ద్వారా సాధారణ మానసిక స్థితికి తీసుకు రాగలుగుతామన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫెయిల్ అయ్యాము అనే కారణం చేతనో లేదా మరి ఏ ఇతర కారణాల చేతనో యువత క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోరాదని, మానసిక దృఢ సంకల్పంతో ఆత్మ న్యూనత భావానికి గురి చేసిన అంశాన్ని పాజిటివ్ దృక్పథంతో తీసుకుని ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిగతులను గమనిస్తూ ఉండాలన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షులు లయన్ పి.సి పవన్ కుమార్ మాట్లాడుతూ మానసికంగా కృంగుబాటుకు గురైనప్పుడు గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి అన్నారు .కార్యక్రమంలో సి. ఆర్ .ఆర్ .ఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి ,పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.