ఆదోనిని ప్రగతి పథంలో నడిపిద్దాం..
1 min readఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి
- ఉమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రికి సిబ్బందిని కేటాయించండి..
- కార్పొరేట్ ఆస్పత్రుల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు
- మార్కెట్ యార్డులో రైతులకు వసతులు కల్పించాలని కలెక్టర్కు విన్నవించిన ఎమ్మెల్యే
ఆదోని, పల్లెవెలుగు: కర్నూలు జిల్లా ఆదోని అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉందని, ఆదోని అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే డా. పార్థసారధి జిల్లా ఉన్నతాధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లో కార్యక్రమం కలెక్టర్ పి. రంజిత్ బాష నేతృత్వంలో జరిగింది. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పార్థసారధి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారుగా 450 ప్రసవాలు జరుగుతున్నాయని, 10 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. ఆరోగ్య శ్రీ క్రింద కొన్ని ఆస్పత్రులు రోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వలసల నివారణకు కస్తూర్బా, జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని , వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, శానిటరీ నాప్కిన్స్ అందజేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.
రణమండల కొండకు రోడ్డు వేయండి…
ఆదోని ప్రజల ఆరాధ్య దైవం శ్రీ రణ మండల ఆంజనేయ స్వామి దేవాలయానికి రోడ్డు మార్గం లేదని, దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాష దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ వెంటనే రోడ్డు మార్గం వేయాలని ఆ శాఖ అధికారి పి. విజయను ఆదేశించారు. అదేవిధంగా ఆదోని ఆటో నగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదోని మార్కెట్ యార్డు లో మౌలిక వసతులు కల్పించాలని, మార్కెట్ యార్డు లో దళారులు రైతులను వడ్డీ పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు . పై సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రంజిత్ బాషను కోరారు.