ఆదోని విజేత.. డా. పార్థసారధి
1 min read18,082 ఓట్లతో గెలుపొందిన కూటమి అభ్యర్థి
ఆదోని, పల్లెవెలుగు:కర్నూలు జిల్లా ఆదోని చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీ జెండా రెపరెపలాడనుంది. కూటమి (బీజేపీ–జనసేన– టీడీపీ)లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన డా. పార్థసారధి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వై.సాయిప్రసాద్ రెడ్డిపై 18,082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికలకు 25 రోజుల ముందు కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి డా. పార్థసారధికి టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ తాను గెలుస్తానని నమ్మకం పెట్టుకున్న సాయి ప్రసాద్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. నియోజకవర్గం పరిధిలో దాదాపు 2లక్షల 73వేల మంది ఓటర్లు ఉండగా… అందులో దాదాపు 1.63 లక్షల మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. కౌంటింగ్ హాల్లో 19 రౌండ్లు పూర్తి అయిన తరువాత కూటమి అభ్యర్థి డా. పార్థసారధి 18,082 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ శివ నారాయణ్ శర్మ ప్రకటించారు. దీంతో రాత్రి 9 గంటల సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణ్ శర్మ ఎమ్మెల్యేగా గెలుపొందిన డా. పార్థసారధి డిక్లరేషన్ పత్రం అందజేశారు.