సాగునీటి హక్కులు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా కృషి చేయండి
1 min readఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి
సానుకూలంగా స్పందించిన అఖిలప్రియ… ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తానని హామీ..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ సమగ్రాభివృద్దిలో కీలకమైన సాగునీటి హక్కుల పరిరక్షణ, ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా కృషి చేయాలని ఆళ్ళగడ్డ శాసన సభ్యురాలు భూమా అఖిలప్రియకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.ఆళ్ళగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియను ఆమె స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపిన బొజ్జా దశరథరామిరెడ్డి. ఈ సందర్భంగారాయలసీమ సమగ్రాభివృద్దికి చేపట్టవలసిన కీలక అంశాలను రాయలసీమ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా రాయలసీమ అభివృద్ధికి చేపట్టవలసిన సమగ్ర సమాచారంతో కూడిన పత్రాన్ని సమితి నాయకులు అందచేసారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమర్థవంతంగా పనిచేయడానికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన వివిధ చట్టబద్ధమైన విధానపరమైన నిర్ణయాలు అమలు గురించి అఖిలప్రియకు బొజ్జా వివరించారు. శ్రీశైలం రిజర్వాయర్ కనీసం నీటి మట్టం 854 అడుగులు గా రూల్ కర్వ్, విద్యుత్ ఉత్పత్తికి నాగార్జునసాగర్ కు కేటాయించిన 264 టి ఎం సీ లకు లోబడే విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాల అమలు అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టులో పూడిక నివారణకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని ఆ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.గత ప్రభుత్వం 365 జీ వో ద్వారా రాయలసీమలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన 102 ప్యాకేజీలను అర్ధాంతరంగా నిలుపుదల చేయడంతో రాయలసీమలోని వివిధ ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని అఖిలప్రియకు వివరించారు. ఈ జీవో తో గోరుకల్లు రిజర్వాయర్ కు సంబంధించిన కీలకమైన నిర్మాణాలు ఆగిపోవడంతో, ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. కెసి కెనాల్ పరిరక్షణకే గాకుండా లక్షలాది ప్రజల త్రాగునీటి సమస్యను గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం ద్వారా తీర్చవచ్చని రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా కృషి చేయాలని కోరారు.కృష్ణా జలాలలో అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు వున్న కర్నూలు జిల్లాలోనే KRMB ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులు, ఎన్ డి ఎ కూటమి 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రకటించిన హామీలు రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, హైకోర్టు, విత్తన రాజదాని, హార్టీ కల్చర్ హబ్, మిషన్ రాయలసీమ, తదితర అంశాలను వివరిస్తూ వాటి అమలుకు కార్యాచరణ చేపట్టాలని కోరారు. సాగునీటి హక్కుల అంశాలపై శాసన సభ్యురాలు సానుకూలంగా స్పందిస్తూ గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, చట్టబద్దమైన హక్కులు అమలు తదితర విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతానని హమీ ఇచ్చారు. అఖిలప్రియను కలిసిన వారిలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, కార్యవర్గ సభ్యులు జాఫర్ రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.