జీవనశైలిలో మార్పే లక్ష్యం : డీపీఓ నాగరాజనాయుడు
1 min read– ప్రతి గ్రామపంచాయతీలో పచ్చదనం
– 200 మొక్కలు నాటాలని నిర్దేశం
– నన్నూరులో హరితహారానికి శ్రీకారం…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి గ్రామపంచాయతీలో మొక్కలు నాటడం ద్వారా జీవన శైలిలో మార్పును ఆకాంక్షిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం నన్నూరులోని రాగమయురి కాలనీలో ఆయన వంద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వర్షాకాలంలో ప్రతి గ్రామపంచాయతీ పచ్చదనంతో కళకళలాడాలని అందుకోసం కనీసం 200 మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శులను ఆయన ఆదేశించారు. గత సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆ ఒరవడిని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆధునిక పోకడలతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందని దీనివల్ల జీవనశైలిలో సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మొక్కలను పెంచి పరిరక్షించడం ద్వారా జీవనశైలిలో సానుకూల మార్పులను సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. గత వేసవి కాలంలో విపరీత ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఉష్ణతాపంతో ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. వృక్ష సంపద ద్వారా వాతావరణ మార్పులను జయించగలమని చెప్పారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు.