పదోతరగతి నుంచే మద్యపానం.. ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
1 min read* ఈ అలవాటుతో కుళ్లిపోయిన పాంక్రియాస్
* బతికే అవకాశాలు దాదాపు లేవన్న వైద్యులు
* కిమ్స్ సవీరా ఆస్పత్రిలో సంక్లిష్టమైన శస్త్రచికిత్స
* పూర్తిగా కోలుకున్న యువకుడు
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : పదో తరగతి చదివే సమయం నుంచే ఉన్న మద్యపానం అలవాటు.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మద్యపానం అలవాటైపోయిన ఓ యువకుడికి.. దాని కారణంగా పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరుకోవడంతో ప్రాణాపాయం ఏర్పడింది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో వ్యాపించడంతో శస్త్రచికిత్స చేసినా బతికే అవకాశాలు దాదాపు లేవనే బెంగళూరులోని పలు ఆస్పత్రుల వైద్యులు అసలు కేసు తీసుకునేందుకే ఇష్టపడలేదు. అలాంటి కేసులో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడమే కాక.. రోగి ప్రాణాలను విజయవంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్.మహ్మద్ షాహిద్ తెలిపారు. “హిందూపురానికి చెందిన 26 ఏళ్ల లోకేష్‌కు తాను పదోతరగతి చదివే సమయం నుంచి మద్యపానం అలవాటు ఉంది. కొంతమందిలో దానివల్ల మరీ అంత సమస్యలు రాకపోయినా, కొందరికి మాత్రం శరీర తత్వం కారణంగా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. లోకేష్‌కు పాంక్రియాస్ చుట్టూ నీరు చేరి, ఒక గోడలా తయారైపోవడమే కాక.. బాగా చీముపట్టి విపరీతమైన ఇన్ఫెక్షన్ (నెక్రోసిస్)కు దారితీసింది. అతడు బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ చదువుతూ వైద్యరంగంలోనే ఉన్నాడు. సమస్య వచ్చిన మొదట్లో ఇక్కడ చూపించుకున్నప్పుడు మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మనోజ్‌కు చూపించారు. ఆయన కొన్ని మందులు ఇచ్చి, శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పారు. దాంతో రోగి, అతడి బంధువులు బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ మూడు నాలుగు పెద్దపెద్ద ఆస్పత్రులకు తిరిగారు. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేయకపోతే బతికే అవకాశాలు దాదాపు ఉండవు. ఒకవేళ చేసినా, 60-70% మంది చనిపోతారు. బతికేవారిలో కూడా జీవితాంతం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉండటంతో బెంగళూరు ఆస్పత్రులలో వైద్యులెవరూ ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు గుండె రేటు కూడా గణనీయంగా పెరిగిపోయింది. రక్తపోటు పడిపోయింది. క్లోమం పూర్తిగా పాడైపోవడంతో దాన్ని తొలగించక తప్పలేదు. ఇన్ఫెక్షన్ ప్రేగులకు కూడా విస్తరించడంతో ముందు జాగ్రత్తగా స్టోమా చేశాం. దీన్ని మరో రెండు మూడు నెలల తర్వాత మళ్లీ లోపల పెట్టేస్తాం. ఈ శస్త్రచికిత్స తర్వాత లోకేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాంక్రియాస్‌ను తొలగించడం వల్ల భవిష్యత్తులో అతడికి కచ్చితంగా మధుమేహం వస్తుంది. ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ నియంత్రణకు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుంది. మద్యపానానికి పూర్తిగా దూరం కావాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి” అని డాక్టర్ మహ్మద్ షాహిద్ వివరించారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఇలాంటి శస్త్రచికిత్సలకు దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. దీన్ని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో కేవలం రూ.2లక్షలకే చేశారు. ఇలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడినందుకు డాక్టర్ మహ్మద్ షాహిద్‌కు, కిమ్స్ సవీరా ఆస్పత్రి యాజమాన్యానికి లోకేష్, అతడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.