PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని విధాలా సన్నద్ధం

1 min read

ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నాం

జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమీషన్ నియమ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.గురువారం రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వివరిస్తూ సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా కౌంటింగ్ కోసం ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నామన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలనుపూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కోసం రాయలసీమ యూనివర్సిటీలోని లైఫ్ సైన్సెస్ బ్లాక్ లోని మూడవ అంతస్తులో కర్నూలు, నాలుగవ అంతస్తులో ఆదోని , లైబ్రరీ బ్లాక్ లోని మొదటి అంతస్తులో మంత్రాలయం, మూడవ అంతస్తులో పత్తికొండ, ఇంజనీరింగ్ బ్లాక్ లోని మొదటి అంతస్తులో పాణ్యం, రెండవ అంతస్తులో ఆలూరు, మూడవ అంతస్తులో కోడుమూరు, నాలుగవ అంతస్తులో ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ హాల్ లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కౌంటింగ్ హాల్ ల వద్ద 72 సిఎపిఎఫ్, 70 ఎస్ఎపి, 391 సివిల్ పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో అన్ని సదుపాయాలతో మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా అభ్యర్థులు/ఏజెంట్ల కమ్యూనికేషన్ కోసం ఇంజనీరింగ్ విభాగంలో కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ లను  సిసి కెమెరాలతో పర్యవేక్షణ  చేయడం జరుగుతుందన్నారు.కౌంటింగ్ హాల్ లలో బ్యారికేడింగ్ పనులు చేపట్టడంతో పాటు వివిప్యాట్ కౌంటింగ్ బూత్ లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈటిపిబిఎస్ స్కానర్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవడం జరిగిందన్నారు. కంప్యూటర్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్ లో కౌంటింగ్ నిర్వహణకు  14 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు… పార్లమెంట్,అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మంత్రాలయం 17 రౌండ్లలో, కర్నూలు, పత్తికొండ, ఆదోని 19 రౌండ్లలో, ఎమ్మిగనూరు, కోడుమూరు 20 రౌండ్లలో, ఆలూరు 21 రౌండ్లలో, పాణ్యం 26 రౌండ్లతో పూర్తి అవుతుందని కలెక్టర్ వివరించారు.  కౌంటింగ్ కోసం అడిషినల్ ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. కౌంటింగ్ సిబ్బందికి సంబంధించిన మొదటి ర్యాండమైజేషన్ ఈనెల 27న, రెండవ ర్యాండమైజేషన్ జూన్ 3వ తేదీన నిర్వహించనున్నామని, వీరికి ఈ నెల 24, 31 తేదిలలో రెండు విడుతలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కోసం వచ్చే సిబ్బందికి తాగునీరు, భోజనం, తదితర అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళి, తదితరులు పాల్గొన్నారు.

About Author