PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి పై న‌మ్మకంతో రాష్ట్రానికి ప‌రిశ్రమ‌లన్నీ తిరిగొస్తున్నాయి..

1 min read

రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

క‌ర్నూలులో 6 కొత్త ఆర్టీసీ బ‌స్సులు ప్రారంభించిన మంత్రి టి.జి భ‌ర‌త్

క‌ర్నూలు బ‌స్టాండును రాష్ట్రంలోనే బెస్ట్ బ‌స్టాండుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం

త్వర‌లోనే విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు విమాన స‌ర్వీసులు.. మంత్రి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన ప‌రిశ్రమ‌ల‌న్నీ త‌మ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత తిరిగి రాష్ట్రానికి వ‌స్తున్నాయ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలులోని ఆర్టీసీ బ‌స్టాండులో 6 నూత‌న బ‌స్సులను ఎంపీ నాగ‌రాజుతో క‌లిసి ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం మంత్రి టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే అంద‌రికీ ఒక న‌మ్మక‌మ‌న్నారు. ఐదేళ్ల క్రితం గ‌న్నవ‌రం నుండి వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ యూనిట్ మ‌ళ్లీ త‌మ యూనిట్‌ను ప్రారంభించేందుకు ముందుకు వ‌చ్చింద‌న్నారు. దీంతో పాటు ఇంకా ఎన్నో ప‌రిశ్రమ‌లు రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు. ఇక క‌ర్నూలు ఆర్టీసీ బ‌స్టాండును రాష్ట్రంలోనే బెస్ట్ బ‌స్టాండుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామ‌న్నారు. ప్రజ‌లకు అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉండేలా బ‌స్టాండును అభివృద్ధి చేయ‌డంతో పాటు ఆర్టీసికి ఆదాయం వ‌చ్చేలా ముందుకు వెళ‌తామ‌న్నారు. త్వ‌ర‌లోనే క‌ర్నూలు ఆర్టీసీ బ‌స్టాండులో ఉన్న స‌మ‌స్యల‌పై స‌మీక్ష నిర్వహిస్తాన‌ని మంత్రి తెలిపారు. ఇప్పుడు ప్రారంభించిన 6 బ‌స్సులే కాకుండా ప్రయాణీకుల‌కు అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని బ‌స్సులు ఏర్పాటుచేసేందుకు సిద్ధమ‌న్నారు. ఇక  త్వర‌లోనే విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌న్నారు. ఈ మేర‌కు ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఎంపీ నాగ‌రాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నిక‌ల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ మేర‌కు అన్నీ అమ‌లుచేసే దిశ‌లో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్.ఎం శ్రీనివాసులు, డీఎంలు సుధారాణి, స‌ద్దాం హుశేన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author