పారదర్శకంగా 105 మద్యం దుకాణాల కేటాయింపు
1 min readజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డిప్పు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ జిల్లా అధికారి రవికుమార్, ఏఎస్పి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా ముగిసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు చేయాలని సూచించిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 105 మద్యం దుకాణాల లైసెన్సులకు గాను 2221 దరఖాస్తులు స్వీకరించామన్నారు. దరఖాస్తుల ద్వారా 40 కోట్ల 42 లక్షల లక్షల మొత్తం వసూలు అయిందన్నారు. లక్కీ డిప్ పద్ధతి ద్వారా ప్రతి ఒక్క దుకాణదారునికి టోకెన్ నెంబర్ కేటాయించి ఎంపిక చేయడం జరిగిందన్నారు. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన దుకాణదారులు వార్షిక ఫీజు మొత్తంలో 1/6 వంతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన వారందరికీ ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ద్వారా ప్రొవిజనల్ లైసెన్సులు అందజేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారిలో ఎవరైనా దుకాణదారుడు డిఫాల్ట్ అయితే రిజర్వ్ 1 మరియు 2 కు కేటాయించేందుకు ఎంపిక చేసామన్నారు.