అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ..పరిగెల మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మాటలు అర్థరహితమని అంబేద్కర్ గారు లేకపోతే నీకు మంత్రి పదవి దక్కేదా అని ప్రశ్నించారు. అమిత్ షా వెంటనే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే అమిత్ షా మూడు పర్యాయాలు మంత్రి పదవి చేపట్టారని మంత్రి పదవి అనుభవిస్తున్నది అంబేద్కర్ పుణ్యమేనని అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి పదవికి రాజీనామా చేయాలని మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు ప్రతి గ్రామంలో నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతాయని మురళీకృష్ణ గారు తెలియజేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 23వ తేదీ పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “బాబా సాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్” కార్యక్రమము జరుగుతుందని స్థానిక రాజ విహార్ సెంటర్ నందలి అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపవలెనని కోరుతామని తెలియజేశారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తే నిరసనకారుల పైన కేసులు పెట్టి జైల్లో పెట్టడం సమంజసంగా ఉందా అని ప్రశ్నించారు. 140 కోట్ల మంది భారత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సమంజసం కాదని వాక్ స్వాతంత్రం కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ ని ఆయన రాజ్యాంగాన్ని దేశ ప్రజలందరూ అనుసరిస్తున్నారని తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ దేశంలో దేవుడి తరువాత అత్యధిక ప్రజలు ఆరాధించే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ ని అటువంటి మహానుభావుడిని అమిత్ షా గగతంలో హోమ్ మినిస్టర్ స్థాయిలో ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉండి జైలు జీవితం గడిపి వచ్చాడని అలాంటి వ్యక్తి కేంద్ర హోం మంత్రి కావడం దేశ ప్రజల దురదృష్టమని దేశ ప్రజలందరూ త్రివర్ణ పతాకాన్ని గుండెల్లో పెట్టుకుంటే, బిజెపి ఆర్ఎస్ఎస్ వారు త్రివర్ణ పతాకమును గౌరవించరని దాదాపు 45 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించలేదని దేశ ప్రజలందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంటే అలాంటి భారత రాజ్యాంగాన్ని తగలబెట్టిన వారు బిజెపి, ఆర్ఎస్ఎస్ వారని సుధాకర్ బాబు విచారం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తులకు రాజ్యాంగంపై గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలాని భాష, కాంగ్రెస్ నాయకులు కే సత్యనారాయణ గుప్త, ఎస్ ప్రమీల, అనంతరత్నం మాదిగ, ఐఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, బి సుబ్రహ్మణ్యం, కోసిగి కె జిలాని మొదలగువారు పాల్గొన్నారు.