ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తల సేమియా వ్యాధి పై అవగాహన సదస్సు
1 min read18 సంవత్సరాల లోపు పిల్లలు రక్త హీనతతో ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి
డాక్టర్ వీణ అక్కినేని
ప్రతి సంవత్సరం పదివేల మంది తల సేమియాతో బాధపడుతున్నారు
రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ వారిచే తల సేమియా వ్యాధి పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్యనిపుణురాలు మరియు కన్సల్టెంట్ పీడియాట్రిక్ హేమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ వీణ అక్కినేని మాట్లాడుతూ దేశంలో తల సేమియా కేసులు పెరగడానికి ముఖ్య కారణం ప్రజలలో సరైన అవగాహన లేకపోవడమేనని, ఆరు నెలల నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే గనుక డాక్టర్ సలహాతో తల సేమియా హిమోఫిలియా, వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. తల సేమియా వ్యాధి పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ పరిష్కారం ఉన్నప్పటికీ మ్యాచింగ్ దాత దొరకాలని, ఇది ఖర్చుతో కూడుకున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వం సహకారంతో చేస్తున్నామని అన్నారు. అనంతరం తల సేమియా చిన్నారులను పరీక్షించి, మందులను సూచించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుమారు పదివేల మంది తల సేమియా మేజర్ తో పుడుతున్నారని, అలాంటివారు జీవితాంతం నిరంతర రక్తమార్పిడి, మందులను వాడవలసిందేనని అన్నారు. తల సేమియా చిన్నారులకు రెడ్ క్రాస్ సొసైటీ అండగా ఉంటుందని కృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు తల సేమియా స్క్రీనింగ్ క్యాంపుకు హాజరైన తల సేమియా చిన్నారులకు వారి తల్లిదండ్రులకు150 మందికి భోజనాన్ని ఏర్పాటు చేసిన మానవత విద్యా నిధి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ జె వి ప్రసాద్ రెడ్డి, డాక్టర్ స్పందన, మానవత విద్యానిధి కమిటీ చైర్మన్ అలపాటి నాగేశ్వరరావు, ఆలపాటి వెంకట లక్ష్మీ ప్రసన్న, లావేటి శ్రీను,పి ఆర్ ఓ కేవి రమణ, విజయవాడ రెయిన్ బో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.