ఆస్థికత్వానికి జీవం పోసిన అన్నమయ్య అందరికీ ఆరాధ్యుడు
1 min readఅంబరాన్నంటిన అన్నమయ్య జయంతి వేడుకలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 616వ జయంతి వేడుకలు కర్నూలు శివారులోని శ్రీ గోదాగోకులం నందు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త మాట్లాడుతూ అన్నమయ్య కారణ జన్ముడని, 32వేల సంకీర్తనలతో భగవంతుని గుణగణాలను కీర్తించి, శాశ్వతమైన బ్రహ్మపదాన్ని చేరుటకు ఈ నాటి సమాజానికి గొప్ప మార్గదర్శి అయ్యారని, సమాజంలో భగవంతుడు ఉన్నాడని నిరూపించిన పరమ తాత్వికుడని, ఆయన కీర్తనలు అజరామరమని కొనియాడారు. ఈ వేడుకలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు కర్నూలు జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో అత్యంత మనోహరంగా, శ్రవణ పేయంగా అన్నమాచార్య సంకీర్తనలు గానం, అన్నమాచార్యుల జీవిత చరిత్ర హరికథా గానం, బృందగానం చేశారు. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్యాలయం విద్యార్థులచే మల్లీశ్వరి, దేవిశ్రీ ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలకు నృత్య నీరాజనం పేరుతో నాట్యవిన్యాసాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా అన్నమయ్యకు అర్చన,పూజ, తిరుమాడ వీధులలో నఖరసంకీర్తన మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోదా పరివారం సభ్యులు పాలాది సుబ్రహ్మణ్యం, పెరుమళ్ళ బాల సుధాకర్, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం, ఇటిక్యాల పుల్లయ్య, చిత్రాల వీరయ్య, భీమిశెట్టి ప్రకాశ్, తలుపుల శ్రీనాథ్, వేముల రవిప్రకాష్, అర్చకులు కిరణ్ భట్టర్, శేషాచార్యులు, లక్ష్మీనారాయణా చార్యులు, మహేషా చార్యులు, కస్తూరి శేషయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కర్నూలు పట్టణానికి చెందిన సంగీత అధ్యాపకులు సి.సరస్వతమ్మతో పాటు, కళాకారులందరినీ గోదాగోకులం బృందం ఘన సన్మానం చేశారు.