ముందస్తు జాగ్రత్తలతో..కీళ్లవాతం నివారించవచ్చు..
1 min readపోషకాహారం తీసుకోవాలి…
- హార్మోన్స్ బ్యాలెన్స్ చూసుకోవాలి
- ప్రముఖ కీళ్ల వ్యాధి నిపుణులు డా. శ్రీహరి రెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు:పోషకాహార లోపం… అధిక ఒత్తిడికి గురికావడం తదితర కారణాలతో కీళ్లవాతం అధికంగా వచ్చే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని స్పష్టం చేశారు ప్రముఖ కీళ్ల వ్యాధి నిపుణులు డా. శ్రీహరి రెడ్డి. నగరంలోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదివారం కర్నూలు హార్ట్ అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ అధినేత, రిటైర్డు కార్డియాలజిస్ట్, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి కీళ్ల వ్యాధి నిపుణులు డా. శ్రీహరిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కీళ్ల నొప్పులకు అనేక కారణాలు ఉన్నాయి. కీళ్ల అరుగుదల, పోషకాహారం లోపం, ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పులు వస్తుంటాయి. వీటిలో కీళ్లవాతం వలన కలిగే నొప్పులను తొలిదశలో గుర్తించి.. వైద్య చికిత్సలు పొందాలని సూచించారు.
హార్మోన్ల..సమతుల్యత…:
మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను సమతుల్యంగా ఉంచే రణాలు ( తెల్లరక్త కణాలు) బ్యాక్టిరియా, వైరస్ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ అసమతుల్యత ఏర్పడినప్పుడు తెల్లరక్త కణాలు మన శరీరంపైనే దాడి చేయడం ప్రారంభిస్తాయి. దీని వలన వచ్చే మార్పులను వాతం లక్షణాలు అంటారు. వీటినే ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. అందులో కీళ్ల వాతం అధికంగా వస్తుంది. జన్యుపరమైన లోపాలు, హార్మోన్ల సమతుల్యత, పర్యావరణంలో ఏర్పడే మార్పుల కారణంగా కీళ్లవాతం రావచ్చని పేర్కొన్నారు.
పాటించాల్సిన..నియమాలు..:
కీళ్లవాతంతో బాధపడే వారు మంచి పోషక విలువలతో కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఆహారంలో పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పొట్టు తీయని తృణధాన్యాలు తీసుకోవాలి. పాలు, గుడ్డు, పెరుగు , ఒమేగా–3 ఫ్యాటీ ఎసిడ్స్ అధికంగా ఉన్న చేపలు, బాధం, సోయా బీన్స్ తీసుకోవడం వల్ల నొప్పులు అదుపులో ఉంటాయని ఈ సందర్భంగా కీళ్ల వ్యాధి నిపుణులు డా. శ్రీహరిరెడ్డి వెల్లడించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..:
మద్యం తాగరాదు..బీడీ, సిగరేట్ కాల్చరాదు. యోగా, ధ్యానంతో ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ర్టాల్ ను అదుపులో ఉంచుకోవాలి. ప్రతి రోజు కనీసం 45 నిమిషాలు వ్యాయమం చేయాలి. ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాక్సిన్లు వేసుకోవాలి. విటమిన్ ‘డి’ లోపం లేకుండా చూసుకోవాలి. చిన్న వయస్సులో గర్భ సంచి, అండాశయం ఆపరేషన్స్ చేయించుకోకూడదు. దంత సమస్య రాకుండా చూసుకోవాలి.