PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుద్ధ్య లోపాన్ని నివారించండి

1 min read

స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయండి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రాష్ట్రవ్యాప్తంగా డయారియా కేసులు నమోదు అయితున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో ఎక్కడా పారిశుధ్యం లోపం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో  త్రాగునీటి సదుపాయం, పారిశుధ్య లోపాలపై ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ సాధారణంగా త్రాగునీటి కలుషితం వల్లే డయేరియా కేసులు నమోదయ్యే ప్రమాదం వుందని… గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో ఎక్కడా పారిశుధ్య లోపాలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలోని ఓఆర్హెచ్ఎస్, పిడబ్ల్యుడి స్కీముల  ట్యాంకులను 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయడంతో పాటు సంబంధిత తేదీలను బోర్డులపై ప్రదర్శించాలన్నారు. తన ఆకస్మిక పర్యటనలో తప్పక పర్యవేక్షిస్తానన్నారు. వర్షాకాలంలో మురికి కాలువల శుభ్రం తో పాటు చెత్తకుప్పలు ఉండడం వల్ల దోమలు పెరిగే అవకాశం ఉందని ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డులలు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలోని పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డీలు బాధ్యతాయుతంగా ఉండి పారిశుద్ధ్య చర్యలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఓ ఆర్ హెచ్ ఎస్, ఇతర నీటి వనరుల మరమ్మత్తులకు సంబంధించి ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉంటాయని వాటిని పరిష్కరించడంతోపాటు ప్రధాన అంశాలను తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్తమాన కాలంలో నీటి సమస్య లేదని పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు కలెక్టర్ కు నివేదించారు. జిల్లాలో రెండు సమగ్ర రక్షిత నీటి పథకాలు మినహా, మిగిలిన 27 సిపిడబ్ల్యూఎస్ స్కీములు పనిచేస్తున్నాయని ప్రస్తుతానికి త్రాగునీటి సమస్య లేదని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వివరించారు. క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేసి పైపులైను లీకేజీలు, మరమ్మత్తులు గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఏఐఐబి స్కీం కింద ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాలలో మంజూరు అయిన మూడు ప్రాజెక్టులలో పనులు మొదలై 15 శాతం పూర్తి అయ్యి మధ్యలో ఆగిపోయాయని పునరుద్ధరణ కొరకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. జలజీవన్ మిషన్, అమృత్ స్కీముల కింద పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, జిల్లా పంచాయతీ అధికారి మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.

About Author