సైబర్ నేరాలపై అవగాహన అవసరం
1 min readసైబర్ నేరాలపై అధికారులకు అవగాహన సదస్సు
సైబర్ నేరాలను తెలియపర్చేందుకు టోల్ ఫ్రీ నెం1930
జిల్లాకలెక్టర్ కె.వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన కలిగివుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబరు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. అదే విధంగా ఇందుకు నిర్ధేశించిన వెబ్ సైట్ www.cybercrime.gov.in సందర్శించవచ్చన్నారు. సైబర్ నేరాలపట్ల అందరిలో అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో జిల్లా అధికారులు కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ కు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు బి.మధు వెంకట రాజా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ సైబర్ నేరాల తీరును వివరిస్తూ,వాటి పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.ఫోన్లలో ఓటిపి, ఓఎల్ఎక్స్, పేటిఎం, గూగూల్ పే, పోన్ పే, కేవైసిలను అప్ డేట్ చేయమని వచ్చే మెసేజ్ లకు సందర్శించకూడదన్నారు. ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఆన్ లైన్ మోసాలు సైబర్ నేరాలపట్ల అవగాహన కలిగియుండి బంధువులకు, స్నేహితులకు, ప్రజలకు వివరించాలన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అనేక వెబ్ సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సెల్ ఫోన్లో వచ్చే లోన్ యాప్ ల జోలికి పోవద్దని ఆయన సూచించారు. సైబర్ నేరాలకు లోనైన బాధితులు వెంటనే పోలీస్ వారికి సంబంధిత వివరాలు అందిస్తే సంబంధిత అక్కౌంట్లను బ్లాక్ చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా పోలీస్ అధికారులమని చెప్పి నేరస్తులు మీపై డ్రగ్స్ కేసు నమోదైయిందని, అసాంఘీక శక్తులతో సంబంధాల ఉన్నాయని ఫోన్ చేసి బెదిరిస్తే వెంటనే సంబంధిత సమాచారం పోలీసులకు అందించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు, కె. భాస్కరరావు, ఎం. ముక్కంటి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.