సైబర్ నేరాలపై విద్యార్ధులకు అవగాహన
1 min readసైబర్ నేరాలపై చుట్టూఉన్న సమాజాన్ని కూడా విద్యార్ధులు జాగృతం చేయాలి
సైబర్ నేరాలకు గురైనపుడు 1930 టోల్ ఫ్రీ కు సమాచారం అందించాలి
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించేలా చైతన్య పరచాలి
స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్ షాప్ లో జిల్లా ఎస్పీ కె.పి.శివ కిషోర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి మోసాలకు ప్రజలు గురికాకుండా సమాజాన్నిజాగృతంచేసే బాధ్యత విద్యార్ధులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాపోలీసు మరియు గ్రామదీప్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రెండురోజులపాటు నిర్వహించనున్న స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్ షాప్ ను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ జ్యోతిప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగతున్నాయన్నారు. సాంకేతికతను ఆసరాగా తీసుకొని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్ధులు ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దానితోపాటు మనచుట్టూఉన్న సమాజాన్నికూడా జాగృతం చేయాలన్నారు. విద్యార్ధి దశనుండి సైబర్ నేరాలపై విద్యర్ధులు అవగాహన కలిగియుండి సమాజంలో మరింత మందికి తెలియజేసే అంబాసిడర్ లు కావాలన్నారు. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్ధిక, భధ్రతాపరమైన నేరాలైన సైబర్ నేరాలపై ప్రతిఒక్కరిలో అవగాహన కలిగించాలన్నారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఒ.టి.పి లు చెప్పరాదన్నారు. యాప్, మెసేజ్ లింకులపై టచ్ చేయరాదన్నారు. సైబర్ నేరగాళ్ళు పంపే అనుమనస్పద కాల్స్, మెసేజ్, ఈమెయిల్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి వాటిపై cybercrime.gov.in లో తక్షణమే ఫిర్యాదుచేయాలన్నారు. సైబర్ నేరాలకు గురైనపుడు 1930 టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారం అందించాలన్నారు. మహిళలు చిన్నపిల్లలపై నేరాలకు విశృంకత పాశవికమైన ఆలోచన విధానాల వల్ల ఇటువంటివి చోటుచేసుకుంటున్నాయని వీటిని అరికట్టడం చట్టాల ద్వారానే కాక మనుషుల మనస్సుల్లో మార్పురావాలన్నారు. బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, అదే విధంగా బాల్యవివాహాలను చేసే వారిపై, ప్రోత్సహించేవారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆకతాయలు వేదిస్తే వెంటనే అదుపుచేసేందుకు, మహిళలు, విద్యార్ధినులకు రక్షణ కల్పించేందుకు అభయ మహిళా రక్షక దళాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై కూడా ముందస్తుగా తమ తల్లిదండ్రులకు అవగాహన పర్చడంతోపాటు సమాజంలో ప్రతిఒక్కరికి విద్యార్ధులు అవగాహన పర్చవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముందుగా తమ తండ్రులతో హెల్మెట్ ధరింపచేసి సంబంధిత ఫొటోలను వారి తరగతి గదుల్లో లేదా పాఠశాల నోటీస్ బోర్డులో అమర్చడం ద్వారా మరింతమందిని చైతన్యపర్చవచ్చని ఎస్పీ విద్యార్ధులకు హితవు పలికారు. అదే విధంగా దొంగతనాలు, ఇతర నేరాల అదుపుకు ప్రతి ఇంటిలోను కాలనీల్లోను సిసి కెమేరాలు ఏర్పాటు చేసుకోనే దిశగా కూడా విద్యార్ధులు తమ తల్లిదండ్రులను, కాలనీవాసులను చైతన్య పరచాలన్నారు. ట్రాఫిక్ కు సంబంధించిన నిబంధనలను వాహనదారులు పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఈ రెండురోజులు అవగాహన కార్యక్రమంలో ఆయా కళాశాలలు, విద్యాసంస్ధల నుండి ఎంపిక కాబడిన 150 మంది విద్యార్ధులు శిక్షణలో తెలిపిన అంశాలను పూర్తిస్ధాయిలో ఆకళింపు చేసుకొని తమ ద్వారా మిగిలిన వారికి అవగాహన కల్పించే దిశగా విద్యార్ధులు కృషిచేయాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో గ్రామదీప్ సంస్ధ నిర్వాహకురాలు డా. మనోహరి, భూమిక సంస్ధ లీగల్ అడ్వయిజరు జి. అనుపమ, తెలుగు రాష్ట్రాల సోషల్ సర్వీస్ ప్రతినిధి కె. శాంతారామ్, ఎస్ ఇ ఆర్ పి ప్రతినిధి సి.ఎ. ప్రసాద్, ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, సైబర్ నేరాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పేక్టర్ ఎం. సుబ్బారావు, సైబర్ సెల్ ఎస్ఐ మధువెంకటరాజా, మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ వి. కాంతిప్రియ, స్పెషల్ బ్రాంచి ఇన్స్పేక్టర్ మల్లేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు, వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.